Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅప్పుడు నోరు విప్పలేదే!

అప్పుడు నోరు విప్పలేదే!

Chiranjeevi’s Public Request To YS Jagan Mohan Reddy

ఎవరికొచ్చింది సినిమా కష్టం?

చిరంజీవి గారూ!
మీ కష్టం పగవాడికి కూడా వద్దు.

అమితాబ్ ని మించిన హీరో.
దేశంలో కోటిరూపాయల రెమ్యునరేషన్ దాటిన తొలి హీరో…
1992, సెప్టెంబర్ 13నాటి “ది వీక్” పత్రిక కవర్ స్టోరీ ఇది.


ఆ స్టోరీ చిరంజీవిదే అని వేరే చెప్పక్కర్లేదు.
ఆ మార్కెట్ మెగాస్టార్ దే అని వివరించక్కర్లేదు.
అదీ చిరంజీవి రేంజ్.
అదీ చిరంజీవి క్రేజ్.

అప్పటికే అంత వుంటే, ఇప్పుడింకెంత వుండాలి?
ఇప్పుడు చిరంజీవిది కేవలం ఇమేజ్ కాదు…మానియా…
ఇప్పుడు చిరంజీవి ఒక వ్యక్తి కాదు…శక్తి.
ఇప్పుడు చిరంజీవి కేవలం ఒక స్టార్ కాదు.. ఒక కాంపౌండ్.
దాసరినారాయణరావు ఖాళీ చేసిన పెదరాయుడు పోస్టుకి ఓన్లీ
కంటెస్టెంట్…చిరంజీవే.

అలాంటి చిరంజీవి..
తనది కాని ఒక సినిమా ఫంక్షన్ లో చేతులెత్తి వేడుకోవడమా!
ప్రభుత్వం ముందు చేయి చాచి అర్థించడమా!
చూస్తున్న అభిమానులకు గుండె పగిలినంత పనయింది.
ఇన్నేళ్ళలో చిరంజీవిని ఎప్పుడూ అలా చూడలేదు.
చిరంజీవినే కాదు.. సినిమాపరిశ్రమ సోకాల్డ్ పెద్దలెవరినీ ఇంత
బేలగా ఎప్పడూ చూళ్ళేదు.

ఎన్ని కన్నీళ్లు?
ఎన్ని కష్టాలు?
తెలుగు సినిమా పరిశ్రమకి కూడా సినిమా కష్టాలు ఎన్నో వున్నాయి.
ఎన్ని సమస్యలు?
ఎన్ని సంక్షోభాలు?
ఎన్ని వివాదాలను చూసిందీ టాలీవుడ్?
ఎప్పుడూ చిరంజీవి గడపదాటి బయటికి రాలేదే?
సక్సెస్ నే తప్ప సమస్యలెప్పుడూ మైక్ ముందు చెప్పుకోలేదే?
మచ్చుకి కొన్ని సమస్యలు గుర్తు చేసుకుందాం.

–తెలుగుసినిమా ఆ నలుగురి కబంధ హస్తాల్లో బందీ
అయిపోయిందని చిన్న నిర్మాతలు గగ్గోలు పెట్టారు కదా.
అప్పుడు చిరంజీవి ఏనాడూ అయ్యో అని కూడా అనలేదే?

–డిస్ట్రిబ్యూషన్ , లీజ్, పర్సెంటేజ్ లాంటి అనేక మలుపుల్లో
చిన్న, చితకా ఎగ్జిబిటర్లు థియేటర్లు మూసుకుని వెళ్ళిపోయారు.
సినిమా పరిశ్రమ సంక్షోభంలో పడుతోందని అప్పుడు
పెద్దలెవరికీ అనిపించలేదే?

–విలన్లు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఫైటర్లు, డాన్సర్లు,
మ్యూజిషియన్లు.. ఇలా అందరూ పరాయిభాషల వాళ్ళే
అయితే.. మాకు అవకాశాలెలా వస్తాయని మన కళాకారులు
కన్నీళ్ళు పెట్టుకున్నా.. సోకాల్డ్ పెద్దలెవరికీ కనికరం కలగలేదే?

— రెక్కాడితే తప్ప డొక్కాడని సినీకార్మికులకు ఇంత
నీడనివ్వాల్సిన చిత్రపురి కాలనీలో రాబందులు
రాజ్యమేలుతున్నాయని ఉద్యమాలు చేసినా.. చిరంజీవి సహా
పెద్దలెవరిలోనూ ఉలుకూ పలుకూ లేదే?

— కాస్టింగ్ కౌచ్ తో అమ్మాయిల జీవితాలు
నాశనమైపోతున్నాయని ఎంతతమంది మైకుల ముందు
మొత్తుకున్నా.. సదరు పెద్దలు సైలెంట్ గానే వున్నారు కదా!

–బడా హీరోలు రెమ్యునరేషన్లకు కోత పెట్టాలి..
సినిమానిర్మాణ వ్యవథిని వ్యయాన్ని తగ్గించుకోవాలి..
ప్రొడ్యూసర్లను కాపాడాలి అని చేసిన తీర్మానాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి కదా!
అప్పుడెప్పుడూ చిరంజీవి ఇంత దీనంగా వేడుకున్నట్టు
అనిపించలేదే?

ఇవాళ ప్రేక్షకులకు టికెట్ రేట్లు అందుబాటులో వుండాలంటే.,
బెనిఫిట్ షోల పేరుతో పెద్ద హీరోల అడ్డగోలు బిజినెస్ చెల్లదంటే,
రిలీజ్ రోజు ఇష్టానుసారం రేట్లను పెంచి జనాల్ని దోచుకోవడం కుదరదంటే..
అది సినిమా పరిశ్రమకు పెద్ద కష్టమైపోయిందా?
వున్నఫళాన సినిమా పరిశ్రమను కాపాడ్డానికి బయల్దేరిపోతారా?

దొరికిన ప్రతి వేదిక మీదా చేతులెత్తి మొక్కుతారా?
ఏరియాల రైట్ల పేరుతో హీరోలు కోట్లు సంపాదిస్తారా?
కూలీనాలి చేసిన కష్టార్జితంతో టికెట్లు కొనే ప్రేక్షకుడు
తెలుగుసినామాని కాపాడాలా?

ప్రభుత్వాలు ఆ ప్రేక్షకుడి జేబు కొట్టి సినిమాని పోషించాలా?
ఇదెక్కడి న్యాయం ?
వందలకోట్ల బడ్జెట్లు..
ఏజ్ బార్ హీరోయిజాలు..
కాంబినేషన్ల వెనుక పరుగులు..
కాలం చెల్లిన కథలు..
ఇవీ తెలుగుసినిమాకు శాపాలు..

కొత్త కథలు రాయించండి..
కొత్త పాత్రలని సృష్టించండి..
కొత్త నటనని ఆవిష్కరించండి.
కొత్త జీవితాలని తెరకెక్కించండి.
అప్పుడు సినిమా దానంతట అదే బతుకుతుంది.

-శైలి

Also Read:

ఇమేజ్ చట్రంలో

Also Read:

భజన చేసే విధము తెలియండి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్