Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Know How To Do Bhajan :

అన్నమయ్య వెంకన్నను కీర్తిస్తూ 32 వేల కీర్తనలు రాసి, పాడి, ప్రచారంలో పెట్టాడు. సంకీర్తన లక్షణ గ్రంథం రాశాడు. మరికొన్ని కావ్యాలు కూడా రాసినట్లు ఆయన మనవడు చెప్పాడు. అయితే ఆ కావ్యాలేవీ దొరకలేదు. కాలగర్భంలో కలిసిపోయాయి. 32 వేల కీర్తనలయినా అన్నీ దొరకలేదు. రాగిరేకుల మీద రాయించిన కీర్తనల్లో రాగిని కరిగించి సొమ్ము చేసుకున్న మన దౌర్భాగ్యానికి మహా అయితే పన్నెండు వేల కీర్తనలే దొరికాయి. అది కూడా తిరుమల ఆలయ భాండారంలో గోపురం మధ్య రహస్యంగా దాచి ఉంచడం వల్ల.

అన్నమయ్య తన పదహారో సంవత్సరంలో తొలి పదం రాశాడని అంటారు. అక్కడినుండి డెబ్బయ్యేళ్లపాటు రోజుకొక కీర్తన రాసినా…70 ఇంటూ 365…25,550 అవుతుంది. అంటే ఒక్కోరోజు రోజుకు రెండు లేదా మూడు కీర్తనలు రాసి ఉండాలి. ఇవికాక ఇతర గ్రంథాల రచన. పఠనం. క్షేత్రాల సందర్శన. ఎడ్లబండి, గుర్రబ్బండ్లలో ప్రయాణాలు. దాదాపు అయిదు శతాబ్దాల కిందటి అన్నమయ్య ఈ భూమి మీద మనలా పుట్టి జీవించింది 95 ఏళ్లు. ఒక జీవిత కాలంలో మానవ మాత్రుడికి సాధ్యం కానంత అపారమయిన విష్ణు భక్తి సాహిత్య రచన చేశాడు. తానే బాణీలు కట్టి పరవశించి గానం చేశాడు. ఊరూరూ తిరిగి వాటిని ప్రచారం చేశాడు.

కారణ జన్ముడయిన అలాంటి అన్నమయ్య తన అంత్య దశలో ఒక మాటన్నాడు-

“దాచుకో నీపాదాలకు – దగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూప – పుష్పము లివి యయ్యా!

వొక్కసంకీర్తనే చాలు – వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన – దాచి వుండనీ
వెక్కసమగునీ నామము – వెలసులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా!

నానాలికపైనుండి – నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను -బొగడించితివి
వేనామాలవెన్నుడా!
-వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా!

యీమాట గర్వము గాదు – నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము – చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను – నేరము లెంచకుమీ
శ్రీమాధవ నే నీదాసుడ- శ్రీవేంకటేశుడవయ్యా!”

అర్థం:-
స్వామీ నీ పాదపూజగా నేను చేసిన కీర్తనా పుష్పాలివి. దాచుకో. ఒక్క సంకీర్తనే చాలు మమ్మల్ను రక్షించడానికి. మిగతావి నీ దగ్గరే భద్రంగా ఉండనీ. నీ నామం ధర తక్కువ. ప్రభావం చాలా ఎక్కువ. నీ కరుణతో నాకు దొరికిన ధనం ఈ కీర్తనలే. అనంత నామాల వాడా! నిన్ను పొగడడానికి నేనెంతవాడిని? నా నాలుకపై నువ్వే కదలాడి నాచే ఈ కీర్తనలన్నీ రాయించావు. ఏదో పోనీలే అని నాకు ఈ పుణ్యం ప్రసాదించావు. ఏ కోశానా గర్వంతో కాకుండా, వినయంగా చెబుతున్నా…నీ మహిమను చెప్పానే కానీ…మధ్యలో కలుగచేసుకుని స్వతంత్రించి నాకు తోచింది చెప్పలేదు. సంప్రదాయాన్ని మీరకుండా నియమంగా పాడేవాడిని. ఇందులో ఏవన్నా లోపాలు ఉంటే క్షమించు స్వామీ! నేను నీ దాసుడిని- అంతే.

*ఇదే ప్లేస్ లో మనముంటే ఇలా చెప్పే వాళ్లం*

స్వామీ!
గూగుల్, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టా, కిండెల్ తో పాటు సకల శాస్త్ర, పురాణ, వేద, వేదాంగాలను చదివి, నమిలి, మింగి, జీర్ణం చేసుకుని రాసి పాడిన అనన్య సామాన్యమయిన, అమోఘమయిన, అపురూపమయిన, అతులిత వేద సమానమయిన కీర్తనలివి. డెబ్బయ్, ఎనభై ఏళ్లు ఇంకే పనులు పెట్టుకోకుండా రాసినవి. మేమివి రాయకపోతే నిన్ను తలుచుకునేవారే ఉండరు.

కాబట్టి ఈ కీర్తనలకు నోబెల్ బహుమతి, హీన పక్షం జ్ఞాన పీఠం అర్జంటుగా నువ్వే ఇప్పించాలి. ఒక్కొక్క కీర్తనకు ఒక లక్ష రూపాయల చొప్పున టీ టీ డి నుండి 320 కోట్లు పన్ను కట్టాల్సిన అవసరం లేని ఒక చెక్కు కూడా నువ్వే ఇప్పించగలవు. హౌస్ సైట్, ఉద్యోగం, ఇంకా సన్మానాలు ఏవన్నా చేస్తే మాకు అభ్యంతరం ఏమీ ఉండబోదు.

అందుకే అన్నమయ్యను వెంకన్న ఒళ్లో పెట్టుకున్నాడు. మనల్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు.

పోతన, రామదాసు, మొన్న మొన్నటి త్యాగయ్య ఎందరో ఇలా వినయ భక్తి సామ్రాజ్యాన్ని ఏలినవారే.

**కట్ చేస్తే…**
మొన్న ఒక రోజు జెమిని టీ వీ లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్ చూసే అదృష్టం నా రెండు కళ్లకు కలిగింది. వినే భాగ్యం నా రెండు చెవులకు దక్కింది.
జూ ఎన్ టీ ఆర్ రామ్ చరణ్ను పొగుడుతాడు. రామ్ చరణ్ జూ ఎన్ టీ ఆర్ ను పొగుడుతాడు. మధ్యలో ఇంకెవరో అసలు ఎన్ టీ ఆర్ ను పొగుడుతారు. ఇద్దరూ త్రిబుల్ ఆర్ ను పొగుడుకుంటారు. ఆ పొగడ్తల్లో, ఆ పులకింతల్లో, ఆ పరవశంలో మనం తడిసి ముద్దయి హీటర్ ముందు ఆరబెట్టుకుంటాం.

పాపం అన్నమయ్య!
సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్నే-
ఏమి రాశావయ్యా? ఇన్ని యుగాల్లో ఇలాంటి కర్ణామృతం నా చెవిన పడలేదు! అని పొగిడితే-
ఊరుకో స్వామీ! నాతో రాయించింది నువ్వే కదా? నాదేముంది? దిస్ క్రెడిట్ గోస్ టు యు- అని చేతులు జోడించి అమాయకంగా , వినయంగా నిలుచున్నాడు.

తాతలు తాగిన నేతులు.
నీతులు తాగిన పిల్లలు.
పిల్లలు మోసిన పల్లకీలు.
పల్లకీలను లేపిన జాకీలు.
జాకీలను లేపిన వారసులు.
వారసులను లేపిన మీడియాలు.

కాచుకో!
మా పాదాలకు మేమే చేసుకున్న భజనలివి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: అప్పుడు మేకకొక తోక -ఇప్పుడు తోకకొక మేక

Also Read: కోట దాటని కోచింగ్

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com