Friday, March 29, 2024
Homeసినిమాపాత్రల్లో వైవిధ్యం...ప్రతిభకు ప్రోత్సాహం... నాగార్జున ప్రస్థానం

పాత్రల్లో వైవిధ్యం…ప్రతిభకు ప్రోత్సాహం… నాగార్జున ప్రస్థానం

వెండితెరకి వారసులు పరిచయం కావడమనేది చాలా కాలం నుంచి ఉన్నదే. సినిమా నేపథ్యం .. సొంత సినిమాలు చేసుకునే సామర్థ్యం ఉండటం వలన హీరోలుగా రాణించడం తేలికని చాలామంది అనుకుంటారు. కానీ వారసత్వమనేది ఒక సినిమాను థియేటర్ వరకూ మాత్రమే తీసుకెళుతుంది .. ఫస్టు సినిమా వరకు మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే బలమైన సినిమా నేపథ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఒకటి రెండు సినిమాలు చేసి ఇంటిదారి పట్టినవారు చాలామందినే ఉన్నారు.

సినిమా నేపథ్యం అనేది ఎంట్రీ వరకూ మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తరువాత నిలబెట్టేది మాత్రం వాళ్ల టాలెంట్ మాత్రమేననేది చాలామంది విషయంలో నిజమైంది. తెలుగు సినిమాకి రెండు కళ్లుగా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లను చెప్పుకుంటారు. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1986లో ‘విక్రమ్’ సినిమాతో ఆయన తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యారు. వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న నాగార్జున, ఆ తరువాత ఎక్స్ ప్రెషన్స్ .. డైలాగ్ డెలివరీ .. డాన్సులలో తనని తాను మలచుకుంటూ వెళ్లారు. యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. ఈ విషయంలో ఆయనకి ‘కిరాయిదాదా’ .. ‘మురళీకృష్ణుడు’ .. ‘జానకి రాముడు’ సినిమాలు బాగా హెల్ప్ అయ్యాయి. చాలా తక్కువ సమయంలో విభిన్నమైన కంటెంట్ తో కూడిన ‘గీతాంజలి’ .. ‘శివ’ సినిమాలు చేయడం నాగార్జునకే చెల్లింది.

వర్మ దర్శకత్వంలో ఆయన చేసిన ‘శివ’ సినిమా ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. యూత్ లో నాగార్జున క్రేజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. యాక్షన్ సినిమాలపై నాగార్జున తనదైన ముద్రవేయడం ఈ సినిమాతోనే మొదలైంది. 80వ  దశకంలో యూత్ కీ .. ఫ్యామిలీ  ఆడియన్స్ కి చేరువైన నాగార్జున, 90వ దశకంలో మాస్ ఆడియన్స్ కి నచ్చే కథలు చేసుకుంటూ వెళ్లారు. అలా ఆయన చేసిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ … ‘అల్లరి అల్లుడు’ .. ‘హలో బ్రదర్’ సినిమాలు మాస్ ఆడియన్స్ నుంచి ఆయనకి మంచి మార్కులను తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల్లో రొమాంటిక్ టచ్ ఉన్న కామెడీ కూడా ఉండటం, ఆయనకి మరింత కలిసొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి.

మొదటి నుంచి కూడా నాగార్జున కాస్ట్యూమ్స్ విషయంలో కొత్త మార్పు తీసుకొచ్చారు. అలాగే తన లుక్ ను కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తూ తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకున్నారు. సాధారణంగా ఒక స్థాయికి వెళ్లిన తరువాత కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి హీరోలు కాస్త ఆలోచన చేస్తారు. కానీ కథాకథనాలు నచ్చితే నాగార్జున అవకాశం ఇచ్చేవారు. ఒక హీరోగానే కాదు .. నిర్మాతగా కూడా రిస్క్ తీసుకుని ఆయన ఎంతోమంది దర్శకులను పరిచయం చేశారు.

కథల్లో .. పాత్రల్లో వైవిధ్యం చూపుతూ, ఎంతోమంది కొత్త కథానాయికలను కూడా ఆయన తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. అందాల అనుష్క కూడా ఆయన పరిచయం చేసిన హీరోయిన్నే. ‘నిన్నే పెళ్లాడుతూ’ ..  ‘ఆవిడా మా ఆవిడే’ .. ‘సంతోషం’ .. ‘మన్మథుడు’ .. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలు నాగార్జునను పూర్తిస్థాయి రొమాంటిక్ హీరోగా ఆవిష్కరించాయి. రొమాంటిక్ హీరోగా తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. టాలీవుడ్ మన్మథుడు అని పిలిపించుకున్నారు.

నాగార్జున కెరియర్ ను పరిశీలిస్తే, తన కెరియర్ విషయంలో మొదటి నుంచి ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు .. చేసిన ప్రయోగాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన భక్తి చిత్రాల దిశగా అడుగులు వేయడం కూడా ఆ ప్రయోగాలలో ఓ భాగమే అనుకోవచ్చు.  అప్పటివరకూ యూత్ ను ఒక ఊపు ఊపేసిన నాగార్జున .. మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించిన నాగార్జున .. ‘అన్నమయ్య’గా కనిపించడానికి సిద్ధమయ్యారు. దాంతో ఆ పాత్రను ఆయన చేయగలుగుతాడా? అని అంతా ఆశ్చర్యపోయారు.

అలాంటివారందరి సందేహాలకు తెరదించేస్తూ ‘అన్నమయ్య’ పాత్రలో జీవించిన ఆయన, ఆ తరువాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా … ‘శిరిడీ సాయి’గా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ .. మలచుకుంటూ .. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ మూడు దశాబ్దాలకి పైగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక వైపున యాక్షన్ సినిమాలు .. మరో వైపున రొమాంటిక్ సినిమాలు ఎడా పెడా చేస్తున్నారు. ఈ తరం హీరోలతో పోటీపడుతున్న నాగార్జున పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 29). ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(నాగార్జున బర్త్ డే స్పెషల్)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్