Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసీ షెల్స్ బీచులో ఆధ్యాత్మిక సమావేశమట!

సీ షెల్స్ బీచులో ఆధ్యాత్మిక సమావేశమట!

Yogi-Bhogi: నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సి ఈ ఓ గా ఉండగా చిత్రా రామకృష్ణ ఏయే లీలలు చేశారో ఇప్పుడు ఒకొటొకటిగా మనం తెలుసుకోగలుగుతున్నాం. పేరులేని లేదా ఇప్పటికి పేరు తెలియని ఒకానొక హిమాలయ యోగికి స్టాక్ ఎక్స్ ఛేంజ్ కు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఆమె చేరవేశారని రుజువులు దొరికాయి. సినిమాల్లోలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి చివర్లో సి బి ఐ, ఎన్ఫోర్స్ మెంట్, సెబీ కట్టగట్టుకుని ఆమెను చుట్టు ముట్టాయి. తీగ ఇంకా లాగకుండానే కదిలిన డొంకలో చిత్రాతిచిత్రమయిన చిత్రా రామకృష్ణ విషయాలు తెలుస్తున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం:

ఒక హిమాలయ యోగితో 2015 లో సీషెల్స్ హాలిడే టూర్ వెళ్లడానికి ఆమె ప్లాన్ చేసుకున్నారు. వారిద్దరి మధ్య మెయిల్స్ సంభాషణలు జరిగాయి. స్టాక్ ఎక్స్ ఛేంజ్ కు సంబంధించి బయట ప్రపంచానికి చెప్పకూడని ఎన్నో విషయాలను ఆమె ఆ యోగికి చేరవేశారు.

1 . ఆ యోగి ఎవరు?

2 . ఆధ్యాత్మిక గురువు అని చిత్రమ్మ చెప్పే చిత్రమయిన వాదన ఒకవేళ నిజమే అనుకుంటే… “సీషెల్స్ బీచ్ లో చిల్ అవుతూ మాట్లాడుకుందాం” అని ఆ గురువు మెయిల్లో ఇచ్చిన పిలుపు కూడా ఆధ్యాత్మికమయినదే అయి ఉంటుందా?

3 . చక్కగా హిమాలయాల్లో బూడిదపూసుకుని మాట్లాడాల్సిన యోగి స్విమ్ డ్రెస్ వేసుకుని సీషెల్స్ కు వస్తున్నానని చెప్పడంలో ఆంతర్యమేమిటి

4 . ఆమె చెప్పినట్లు ఆధ్యాత్మిక గురువుతో సీ షెల్స్ బీచుల్లో ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడుకోవచ్చు.  కానీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ రహస్యాలు ఆధ్యాత్మిక గురువుకు ఎలా చేరాయి?

5 . చిత్రమ్మను ఆ యోగి ఆడించాడా? ఆ యోగిని చిత్రమ్మ ఆడించిందా? ఇద్దరినీ ఇంకెవరో ఆడించారా?

6 . అన్నేళ్లపాటు దేశంలో లక్షల కోట్ల రూపాయల విలువయిన లావాదేవీలు జరిగే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ను ఒక సి ఈ ఓ ఊరు పేరు లేని ఒక “సర్వసంగ పరిత్యాగి” చేతిలో ఎలా పెట్టింది?

7 . The Monk Who Sold His Ferrari అని బాగా పాపులర్ అయిన పుస్తకం. ఈ చిత్రా యోగి కథ విన్న తరువాత The Monk Who Sold our National Stock Exchange అని ఎవరయినా పుస్తకం రాస్తే హాట్ కేకులా అమ్ముడుపోతుంది.

8 . అంతా దేవుడి దయ అంటే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో ఇన్నాళ్లూ ఏదో ఊతపదం అనుకున్నారు. నిజంగా గాడ్ మ్యాన్ దయ అని చిత్రా మెయిల్స్ ఓపెన్ చేశాక తెలుస్తోంది.

9 . శ్రీహరికోటలో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశ పెట్టడానికి ముందు సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడిలో పూజలు చేయిస్తారు. అలాగే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఇండెక్స్ ను రాకెట్లా అంతరిక్షంలోకి పంపాలన్న సదుద్దేశంతోనే మా చిత్రమ్మ గాడ్ మ్యాన్ ను కలిసేవారు అని ఆమెను అభిమానించేవారి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక సమర్థన. భౌతికమయిన విషయాల్లో క్లారిటీ రానప్పుడు ఆధిభౌతిక కక్షలోకి వెళ్లడమే రక్ష.

10 . అమెరికాలో ఒక ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు కోర్టులో రుజువు కావడంతో అప్పట్లో హైదరాబాద్ ఇండియన్ బిజినెస్ స్కూల్- ఐ ఎస్ బి డీన్ ఉద్యోగం పోయింది. అమెరికాలో జైలు పాలయ్యాడు. ఇది అమెరికా కాదు. ఇండియా. చిత్రా ఒంటి మీద ఈగ వాలకపోవచ్చు. వాలినా గాడ్ మ్యాన్లు ఆ ఈగలను మాయం చేయవచ్చు.

“దేవుడా! రక్షించు నా దేశాన్ని…
లక్షలాది దేవుళ్ళ నుండి
వారి పూజల నుండి
వారి వారి ప్రతినిధుల నుండి…”

అని దేవరకొండ బాలగంగాధర తిలక్ అన్నది ఇందుకే!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్