అమరావతి రాజధానిపై భారత అత్యున్నత న్యాయస్థానంలో నేడు విచారణ మొదలైంది. అయితే ఈ కేసు విచారణలో తాను భాగస్వామ్యం కాలేనని, తాను సభ్యుడిగా లేని వేరొక ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ స్పష్టం చేశారు. గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనంలో తాను పాల్గొన్నానని, అందుకే తాను ప్రస్తుత విచారణలో పాల్గొనేందుకు సుముఖంగా లేనని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
తదుపరి ధర్మాసనం ఏమిటి, విచారణ తేదీఏమిటనేది తెలియజేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరగా తాను విచారణ తేదీ నిర్ణయించడం సరికాదని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
అయితే సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ వచ్చే వారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ తరువాతే ఈ కేసు తదుపరి విచారించే ధర్మాసనం, తేదీ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.