ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) సమావేశంలో ఇవాళ హైడ్రామా చోటుచేసుకున్నది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్లు దాడులకు పాల్పడ్డారు. మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస ఏర్పడింది. సభలో ఉన్న సభ్యుల మధ్య తోపులాట జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ సభ్యులు నినాదాలు చేశారు. ఎంసీడీ తాత్కాలిక స్పీకర్‌గా సత్య శర్మను ఎల్జీ అపాయింట్ చేశారు. అయితే ఆ స్పీకర్ ఇవాళ నామినేట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహానికి లోనైంది. నామినేట్ సభ్యుల కన్నా ముందు ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించాలని ఆప్ సభ్యులు గొడవకు దిగారు. తాజాగా జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లతో విజయం సాధించింది. మేయర్ పదవి కోసం ఆ పార్టీ ఇద్దర్ని పోటీలోకి దించింది. షెల్లీ ఒబ్రాయ్, ఆశూ థాకుర్‌లు మేయర్ పోటీలో ఉన్నారు. బీజేపీ తరపున రేఖా గుప్తా పోటీలో ఉన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా బీజేపీ కౌన్సిలర్‌ను ఎల్జీ నియమించడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహంగా ఉంది.