Friday, March 28, 2025
HomeTrending NewsLibiya: లిబియాలో సాయుధ గ్రూపుల ఘర్షణలు... 27 మంది మృతి

Libiya: లిబియాలో సాయుధ గ్రూపుల ఘర్షణలు… 27 మంది మృతి

ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశంలో గడాఫీ మరణం తర్వాత నాయకత్వ సంక్షోభం దేశాన్ని సంక్షోభం వైపు తీసుకువెళుతోంది. పశ్చిమ దేశాల కుట్రలకు ప్రయోగ శాలగా లిబియా మారింది. మహమ్మద్ గడాఫీని అంతమొందించిన తర్వాత అమెరికా దాని మిత్ర దేశాలు లిబియా బాగోగులు పట్టించుకోవటం మానేశాయి. చమురు, ఇతర ఖనిజ సంపదల కాంట్రాక్టులు దక్కించుకొన్న బహుళజాతి సంస్థలు… లిబియా ప్రజల భవిష్యత్తును అంధకారం చేశాయి.

మంగళవారం లిబియాలో రెండు సాయుధ గ్రూపుల నడుమ ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజధాని ట్రిపోలిలో రెండు రోజుల నుంచి కొనసాగుతున్న  ఘర్షణల్లో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 106 మందికిపైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఆ రెండు గ్రూపుల వాళ్లే కాకుండా సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

సోమవారం 444 బ్రిగేడ్‌ కమాండర్‌ మహ్మద్‌ హమ్జాను స్పెషల్‌ డిటెర్రెన్స్‌ దళం బంధించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. స్పెషల్‌ డిటెర్రెన్స్‌ దళం అనేది 444 బ్రిగేడ్‌కు ఉన్న బద్ధ శత్రువుల్లో ఒకటి. ఈ క్రమంలో మహ్మద్‌ హమ్జా స్పెషల్‌ డిటెర్రెన్స్‌ దళం ఆధీనంలోని మెయిన్‌ మిటిగా ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం చేసేందుకు ప్రయత్నించాడు.

దాంతో స్పెషల్‌ డిటెర్రెన్స్‌ దళం అతడిని బంధించింది. పోరాడేందుకు కాకుండా ప్రయాణం చేసేందుకు నిరాయుధుడిగా వచ్చిన హమ్జాను స్పెషల్‌ డిటెర్రెన్స్‌ దళం ఎందుకు బంధించాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. స్పెషల్‌ డిటెర్రెన్స్‌ దళం(అల రాడా)… 444 బ్రిగేడ్‌ సాయుధ సంస్థల మధ్య దశాబ్ద కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. 2011లో గడాఫీ మరణం తర్వాత అధికారం చేజిక్కించుకునేందుకు రెండు సంస్థలు దేశాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్