ఆక్సిజన్ సరఫరాపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒరిస్సా, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు.
రుయా సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనలో అధికారుల తప్పిదం ఏమి లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలనుంచి విమానాల ద్వారా, విదేశాల నుంచి ఓడల ద్వారా ఆక్సిజన్ ను తెప్పిస్తున్నామని చెప్పారు.
తమిళనాడు నుంచి టాంకర్ రావడం ఆలస్యం అయినందువల్లే రుయా ఘటన సంభవించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాదారు. జిల్లాల్లో కోవిడ్ పరిస్థితిపై అరా తీశారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా వుండాలని, ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వాక్సిన్ పై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.