ప్రమాదకర పరిస్థితుల్లో ‘దిశ’ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్నదానిపై అక్క చెల్లెమ్మలకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళా భద్రతపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి అత్యున్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లకు దిశ యాప్ పై శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలు అందరికీ దీనిపై అవగాహాన కలిగించాలని సిఎం నిర్దేశించారు. దిశ యాప్ ఎలా వాడాలన్నదానిపై పూర్తి చైతన్యం కలిగించాలని, ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేలా చూడాలని ఆదేశించారు. కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్ వినియోగంపై తెలియజెప్పాలని, దీని ద్వారా యాప్ వినియోగం పెరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, వారిచ్చే ఫిర్యాదులపై దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా సన్నద్ధం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో ఉంచాలని డిజిపిని ఆదేశించారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు సీఎంఓ అధికారులు హాజరయ్యారు.