We assure you: ఉక్రెయిన్ నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరమున్నా వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన వెంటనే అక్కడి విద్యార్థులను సరక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించానని సిఎం చెప్పారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్ధులు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్.జగన్‌ను కలుసుకున్నారు.
“మీరంతా రాష్ట్రానికి చెందిన పిల్లలు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం మా బాధ్యత, దాన్ని అధికారులు సక్రమంగా నిర్వర్తించారు’ అని సిఎం వ్యాఖ్యానించారు. విద్యార్ధులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సిఎం అభినందించారు.
ప్రస్తుతం విద్యార్ధుల సమస్యకు తగిన పరిష్కారం లభించేలా వీలైన అన్ని మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాయాలని నిర్ణయించారు. ద్యార్థులతో వివిధ అంశాలపై మాట్లాడిన సిఎం వారి చదువులపై ఆరా తీశారు. వారి వారి కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారో తెలుసుకున్నారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలపై ఆరాతీసి, ఈవిషయంలో ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఉక్రెయిన్ నుంచి తమను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని విద్యార్థులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ సమీప దేశాలకు చేరుకున్న దగ్గరనుంచి ఆహారం, వసతి విషయాల్లో బాగా చూసుకున్నారన్న విద్యార్థులు సిఎంకు వివరించారు. దీనితోపాటు దేశంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి స్వస్థలాలకు చేరేంత వరకూ ఫ్లైట్ టిక్కెట్లు దగ్గరనుంచి ప్రయాణ, వసతి సదుపాయాల ఏర్పాటు చేశారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.