రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన బెజవాడ బార్ అసోసియేషన్ భవన సముదాయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఎం మాట్లాడుతూ జస్టిస్ రమణ చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం కావడం అరుదైన, ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టమని పేర్కొన్నారు. భూమి పుత్రుడు రమణ చేతుల మీదుగా శంఖుస్థాపన జరిగిన ఈ భవనం ఆయన చేతుల మీదుగానే ప్రారంభం కావడం దేవుడి విధి అభివర్ణించారు.
సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలందరికీ సత్వర న్యాయం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తన హయంలో దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో ఖాళీలను పెద్ద సంఖ్యలో పూర్తి చేశామని,11 మంది సుప్రీం కోర్టు జడ్జీలు, 250 మంది హైకోర్టు జడ్జీలు, 15మంది చీఫ్ జస్టిస్ లను నియమించగలిగామని వివరించారు. న్యాయవ్యవస్థ కూలిపోతే, దానిపై నమ్మకం పొతే, విశ్వాసం సన్నగిల్లితే అది అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదమని రమణ ఆందోళన వ్యక్తం చేశారు.
సిఎం జగన్ తెలుగులో మాట్లాడిన తరువాత తాను తెలుగులో మాట్లాడకపోతే బాగుండదని రమణ చమత్కరించారు. తెలుగులో మాట్లాడడం మంచి పరిణామమన్నారు. తాను, సిఎం ఇద్దరం మాత్రమే తెలుగులో మాట్లాడామని, దీనికో విశిష్టత ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన, ఆర్ధిక సమస్యలతో ప్రభుత్వాలు నిధులు ఇవ్వలేకపోవడం, కంట్రాక్టర్ నిర్లక్ష్యం రణంగా భవన నిర్మాణం ఆలస్యమైందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : వ్యవస్థలో మార్పులు తెచ్చాం: సిఎం జగన్