Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఎప్పటికీ పనివాళ్ళుగానే మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డి విరుస్తూ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పిల్లల చదువులతోనే పేదల తలరాతలు మార్చాలనే సంకల్పంతోనే విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు.  రూపం మార్చుకున్న అంటరానితనాన్ని తుద ముట్టించాలనే లక్ష్యంతోనే  విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా జనగన్న అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చామని చెప్పారు.  దీనితో పాటు జగనన్న గోరు ముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మనబడి నాడు-నేడు, బైజూస్ ఒప్పందం, 8వ తరగతి విద్యార్థులకు టాబ్ ల పంపిణీ  లాంటి ఎన్నో వినూత్న పథకాలతో….  తీసుకువస్తున్న ప్రతి మార్పు వెనుకా మన రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్ పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్దిని తెలియజేస్తుందన్నారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సిఎం జగన్ జాతీయ జెండా ఆవిష్కరించి, అనంతరం రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, వాటి అమలు వెనకున్న ఉద్దేశాన్నీ వివరించారు.  తమ పాలనలో ఇప్పటి వరకూ  విద్యారంగంపై  చేసిన ఖర్చు 53వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందన్నారు.

మూడేళ్ళ పరిపాలనా కాలంలో వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చామని సిఎం జగన్ చెప్పారు. మహిళా సాధికారత విషయంలో దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచామన్నారు. తమ ప్రభుత్వం మనసు పెట్టి అలోచించి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందన్నారు.  బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యారంగాల్లో వెనుకబడిన తరగతులకు అవకాశం  ఇచ్చి వారికి తగిన న్యాయం చేశామన్నారు. తాము తీసుకువచ్చిన మార్పులు, చర్యలు ఏ ఒకరిద్దరి కోసమో తీసుకు వచ్చినవి కావని, వ్యవస్థను మార్చడానికి తీసుకు వచ్చినవని, వీటి ఫలితాలు రాబోయే దశాబ్ద కాలంలో  తెలుస్తాయని చెప్పారు.

ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటికంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ లో బాగుండడమే రాష్ట్ర అభివృద్ధి అని, అదే మన నిజమైన స్వాతంత్రానికి అర్ధమని తాము బలంగా విశ్వసించామని వెల్లడించారు. ఎన్నికలవరకే రాజకీయాలు అని, ఆ తర్వాత అంతా మన ప్రజలే అని నమ్మామని, అందుకే తాము  సంక్షేమ పథకాల అమల్లో పార్టీ, మతం, కులం, ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని సిఎం జగన్ ఉద్ఘాటించారు. ప్రతి పథకంలోనూ శాచురేషన్ విధానం అమలు చేస్తున్నామన్నారు.  అందుకే ఈ మూడేళ్ళ పాలనా కాలంలో లక్షా 65వేల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎలాంటి అవినీతికి, లంచాలను తావు లేకుండా ప్రజలకు అందించగలిగామన్నారు.

సంక్షేమ పథకాలను మానవ వనరులపై పెట్టుబడిగానే భావిస్తున్నామని… దీనికోసం ఖర్చు పెట్టె  ప్రతి రూపాయిని  ఆయా కుటుంబాలను పేదరికం సంకెళ్ళనుంచి తెంచే సాధనాలుగా భావిస్తున్నామని వివరించారు.

Also Read ఆ నేతల స్ఫూర్తితోనే…: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com