Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మైనార్టీల సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరిస్తామని, వారి సంక్షేమానికి అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.  ముస్లిం సంఘాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. తమ సమస్యలను వారు సిఎంకు వివరించారు. ముస్లింలకు మన ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల  చైర్మన్లు, డైరెక్టర్లుగా పెద్ద ఎత్తున అవకాశం కల్పించాంని వారికి సిఎం గుర్తు చేశారు.

“ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.  భగవంతుడి దయ వలన, మీ అందరి ఆశీర్వాదం, మీ సహాయ సహకారాలతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇది మనందరి ప్రభుత్వం అన్న విషయాన్ని మనసులో పెట్టుకొండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్నల్ని పిలిచాం.  అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది. ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తాం. ప్రతి ఇంటికి, ప్రతి గడపకూ మంచి చేశాం. దేవుడి దయతో ఇదంతా చేయగలిగాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు” అని సిఎం వారితో అన్నారు.

వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను ముస్లిం పెద్దలు సిఎంకు వివరించారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌హౌస్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని,  విజయవాడలో హజ్‌హౌస్‌ నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయించాలని అధికారును ఆదేశించారు.  వక్ఫ్ బోర్డు ఆస్తులతో పాటు అన్ని మతాల భూముల పరిరక్షణకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి… జిల్లాస్ధాయిలో ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు.

ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచడానికి సిఎం అంగీకరించారు. గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో సులభతరమైన రెన్యువల్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని… కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలన్న సిఎం ఆదేశాలు ఇచ్చారు.  సయ్యద్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తి, కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం ఆమోదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com