Saturday, November 23, 2024
HomeTrending Newsపోస్టుల భర్తీలో పారదర్శకత: సిఎం ఆదేశం

పోస్టుల భర్తీలో పారదర్శకత: సిఎం ఆదేశం

Fill Fast: విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతోందని, ఈ శాఖల్లో ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఖాళీలు భర్తీ చేయకపోతే ఈ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రయోజనాలు విద్యార్ధులు, ప్రజలకు అందవని వ్యాఖ్యానించారు.  ఉన్నతవిద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలని స్పష్టంచేశారు. జాబ్‌ క్యాలెండర్‌పై క్యాంప్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

2021–22లో ఖాళీలుగా గుర్తించిన మొత్తం 47,465 పోస్టుల్లో 39,654 భర్తీ చేశామని, వీటిలో ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులకు నియామకాలు చేశామని అధికారులు సిఎంకు వివరించారు. గుర్తించిన పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఒక్క ఏడాదిలో పూర్తయిందని తెలిపారు. ఇంకా 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉందని వివరణ ఇచ్చారు. వీటిలో కూడా 1,198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయని వివరించారు.

ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై త్వరితగతిన కార్యాచరణ రూపొందించుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సిఎం ఆదేశించారు. రెగ్యులర్‌పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలని అధికారులకు సూచించారు. దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. 39,654 పోస్టుల భర్తీతో పాటుఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షలమందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని వివరించారు.

పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలన్నారు. వచ్చే నెల మొదటి వారంలో తనకు ఈ విషయమై నివేదిక ఇవ్వాలన్నారు.  కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి,  ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్త, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు మరియు హెచ్‌ఆర్‌ఎం) హెచ్‌ అరుణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : సిఎంను కలిసిన సచివాలయాల ఉద్యోగులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్