Don’t Worry:  పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణతాశాతం రావడంపై  విచారించాల్సిన అవసరం లేదని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫెయిల్‌ అయిన వారికి  నెలలోజుల్లోనే మళ్ళీ పరీక్షలు పెడుతూ వాటిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తున్నామని చెప్పారు. పాస్‌ అయినవారికి కూడా ఏదైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్‌ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని విద్యాశాఖ అధికారులు సిఎం దృష్టికి తీసుకు వెళ్ళారు. విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష సందర్భంగా  నాడు–నేడు పనుల ప్రగతితో పాటు విద్యాశాఖలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.

మరోవైపు, ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు రెండో దశ పనులను ఈ నెలాఖరు నాటికి మొదలు పెట్టి నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెండో దశలో సుమారు 22,344 స్కూళ్ళలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఉండేటట్టు చూసుకోవాలని సూచించారు. బోధన, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఇప్పటికే నాడు నేడు పూర్తయిన స్కూళ్లలో వాచ్‌మెన్‌ నియామకంపై ఆలోచన చేయాలని, తద్వారా పాఠశాలలో విలువైన ఆస్తులకు రక్షణ కల్పించగలుగుతామని పేర్కొన్నారు.

స్కూళ్లుప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక అందించాలన్నారు.  బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ లేదా కేజీబీవీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామమని, 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని వెల్లడించారు.

రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ పనితీరుని అధికారులు సిఎంకు వివరించారు, ఇప్పటివరకు సుమారు 57,828 మంది రోజూ ఆ యాప్‌ని వినియోగిస్తున్నారని తెలిపారు. ఫొనిటిక్స్‌ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని, పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలగాలని జగన్ అభిప్రాయపడ్డారు.

సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయకుమార్‌ రెడ్డి, ఇంటర్‌మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ పాలసీ) సుస్మిత్‌ సర్కార్, ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Readబైజూస్ తో ఒప్పందం : ప్రభుత్వ స్కూళ్ళలో ఎడ్యు-టెక్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *