Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Great Day: ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి  చదువుతున్న దాదాపు 32 లక్షల మంది విద్యార్ధులకు బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ప్రభుత్వం-బైజూస్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ– లెర్నింగ్‌ కార్యక్రమంపై చర్చించారు.  ఏపీతో  కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని రవీంద్రన్‌ చెప్పారు.  ఈ చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది.

ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్‌’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డం కాకూడదనే సంకల్పంతో ఈ ప్రక్రియకు రూపకల్పన చేసింది.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు.  ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న  ప్రభుత్వ స్కూళ్ళలోని 4.7 లక్షల మంది విద్యార్థులు 2025 నాటికి సీబీఎస్‌ఈ నమూనాలో పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిని సన్నద్ధంచేసేందకు వీలుగా ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్‌ యాప్‌కూడా ఉచితంగా అందుబాటులోకి తె స్తోంది. దీనికోసం విద్యార్ధులకు ట్యాబ్‌కూడా ప్రభుత్వం సమకూర్చనుంది.

తన జీవితంలో ఈరోజు ఎంతో సంతోషమైన రోజని రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం అన్నది చాలా పెద్ద ఎచీవ్‌మెంట్‌ గా అయన అభివర్ణించారు.   తాను అడిగిన వెంటనే బైజూస్‌ రవీంద్రన్  సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇంత కంటెంట్‌ఇవ్వడానికి ముందుకు రావడం కూడా చాలా మంచి పరిణామమని, ట్యాబ్‌లమీదే మనకు ఖర్చు అవుతుందని, కంటెంట్‌ విషయంలో బైజూస్‌ నాలుగు అడుగులు ముందుకేసి ప్రభుత్వానికి సహకరించడానికి సంసిద్ధత తెలిపిందని సిఎం వెల్లడించారు.

ఏడాదికి ట్యాబ్‌ల రూపంలో కనీసంగా రూ.500 కోట్లు ఖర్చయినా కూడా నాణ్యమైన విద్య దిశగా ఇదో పెద్ద ముందడుగు వేస్తున్నామన్నారు.  టీచర్లకు కూడా శిక్షణ అందుతుంది, వారు నిరంతరం అప్‌ గ్రేడ్ అయ్యేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రైవేటు పిల్లలకు, ప్రభుత్వ పిల్లలకు వ్యత్యాసం లేకుండా… అదే క్వాలిటీ విద్య.. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు అందుబాటులోకి వస్తుందని సిఎం పేర్కొన్నారు. ఈ సెప్టెంబరులోనే ట్యాబ్‌లు ఇస్తామని, ఇకపై ప్రతి ఏటా 8 వరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు.  వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తామనన్నారు. వీడియో కంటెంట్‌ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు పెడతామని వివరించారు.

సిఎం జగన్ చొరవపై బైజూస్ సిఈఓ రవీంద్రన్ ప్రశంసలు కురిపించారు. యంగ్‌ స్టార్టప్‌కన్నా ముఖ్యమంత్రి వేగంగా అడుగులు వేశారని, మే 25న తొలి సమావేశం జరిగితే వెనువెంటనే ఒప్పందం కుదుర్చుకున్నారని కితాబిచ్చారు.  నమ్మశ్యంకాని రీతిలో సీఎం వేగంగా స్పందించారన్న రవీంద్రన్‌.. ఇది మిగిలిన నాయకులకు కూడా అనుసరనీయమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయకుమార్‌ రెడ్డి, ఇంటర్‌మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ పాలసీ) సుస్మిత్‌ సర్కార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : నేడే ఉచిత పంటల బీమా నిధులు విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com