మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్….. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన… గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్ పంపిణీ… అదేరోజు మొదలు పెట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ అందుబాటులో ఉండాలని, డబ్ల్యూహెచ్‌ఓ లేదా జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి మన రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలవాలని, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు.
సిఎం సూచనల్లో ముఖ్యాంశాలు:
- వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలి
- స్కూల్స్, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలి
- పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలి
- 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
- ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి, ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని సేవలను వివరించాలి
- కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం
- ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు, లకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
- పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆర్యోశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్(డ్రగ్స్) రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హెచ్ ప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.