నకిలీ చలానాల కుంభకోణం వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన బోగస్ చలానాల అంశంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సిఎం సమావేశమయ్యారు. ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేశామని అధికారులు సిఎంకు వివరించారు. సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశామని, సీఎఫ్ఎంఎస్ లకు అనుసంధానం చేశామని తెలియజేశారు. దీని ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరణ ఇచ్చారు.
డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్త్రార్ లతో కుమ్మక్కై ఈ వ్యవహారానికి పాల్పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఖజానాకు దీనితో రూ. 5.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలియవచ్చింది. దర్యాప్తు పూర్తయ్యే నాటికి ఈ విలువ పది కోట్ల రూపాయల వరకూ చేరవచ్చని అంచనా. ఇప్పటికే ప్రభుత్వం ఐదుగురు సబ్ రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేసింది. రేపో మాపో విజయవాడ పటమట రిజిస్ట్రార్ ను కూడా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఏడాది కాలంగా జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను మరోసారి క్షుణ్ణంగా విచారణాధికారులు పరిశీలించనున్నారు.