CM Jagan conducted review on Covid during Spandana with District Collectors :
కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందో, రాదో కచ్చితంగా చెప్పలేమని, సన్నద్ధంగా ఉండడం అన్నది మాత్రమే మన చేతుల్లోని అంశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ నియంత్రణలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. మే 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ, మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని, మే 15న 25.56 శాతానికి పైగా పాజిటివిటీ ఉంటే… ప్రస్తుతం 5.97శాతం ఉందని వివరించారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా, సమాజంలో ఏ వర్గాన్నీ కష్టపెట్టకుండా కోవిడ్ ను నియంత్రించ గలిగామని అన్నారు.
స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కోవిడ్, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్భన్ క్లినిక్స్, ఇళ్లపట్టాలు, జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమం, ఖరీఫ్ సన్నద్ధతలపై జగన్ కలెక్టర్లకు పను సూచనలు చేశారు.
కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సూచించారు. మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దని సిఎం హితవు పలికారు. “కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి, ఇవి మన జీవితంలో భాగం కావాలి. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి” అని జగన్ పేర్కొన్నారు.
కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందో, రాదో కచ్చితంగా చెప్పలేమని, సన్నద్ధంగా ఉండడం అన్నది మాత్రమె మన చేతుల్లోని అంశమని సిఎం జగన్ స్పష్టం చేశారు. మూడో దశలో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారని, దీని కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ఇప్పటి నుంచే దీనికోసం ప్రత్యెక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఉద్భోదించారు. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
“వాక్సినేషన్ అన్నది చాలా ముఖ్యమైనది, వాక్సినేషన్ కెపాసిటీ దేశంలో పెరగాల్సిందే. ఆలోగా మనకు వచ్చే వాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి. నిర్దేశించుకున్న విధివి«ధానాల ప్రకారం వాక్సినేషన్ ఇవ్వాలి. నిర్ణయించుకున్న విధానాలనుంచి పక్కకు పోవద్దు, తన, మన భేదం చూపొద్దు. మనం కరెక్టుగా ఉంటే.. వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తాయి” అని కలెక్టర్లకు నిర్దేశించారు జగన్.
“మూడున్నర కోట్ల మందికి వాక్సిన్ ఇవ్వాల్సి ఉంటే… ఇందులో 26,33,351 మందికి మాత్రమే రెండు డోసులు వాక్సినేషన్ ఇవ్వగలిగాం. మరో 69,04,710 మందికి ఒకడోసు మాత్రమే ఇవ్వగలిగాం. వాక్సినేషన్ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా అమలు చేయాలి” అని గణాంకాలతో సహా వివరించారు.
జూన్ 20వరకూ కర్ఫ్యూ ఉంటుందని, ఆ తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని సిఎం జగన్ సూత్రప్రాయంగా వేలదించారు. సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగిస్తామన్నారు.
Also Read : మన తపన ప్రజల్లోకి తీసుకెళ్ళండి : జగన్