Friday, March 29, 2024
HomeTrending Newsకేసీయార్ ను తిడితే లీడర్లు కాలేరు: కేటిఆర్

కేసీయార్ ను తిడితే లీడర్లు కాలేరు: కేటిఆర్

కేసీయార్ ను తిడితే పెద్ద లీడర్లు కాలేరని, ఆయన్ను ఎంత తిట్టినా మాకు పోయేది ఏమీ లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటిఆర్ బిజెపి, కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు కార్యక్రమం అమలు చేస్తున్నారా అంటూ నిలదీశారు. రైతులు సంఘటితం కావాలని, రైతులే మార్కెట్ ను శాసించాలన్నది కేసియార్ కల అని అయన అభివర్ణించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్ పల్లి మండలం, కొదురుపాక గ్రామంలో మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ, తాతయ్య జ్ఞాపకార్ధం తన సొంత ఖర్చులతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, రాజ్య సభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో విపక్ష నేతలు సిఎం కేసీయార్ పై చేస్తున్న విమర్శలపై కేటియార్ ఘాటుగా స్పందించారు. నోరుంది కదా అని ప్రతిపక్షాలు ఎటుబడితే అటు మాట్లాడితే చెల్లదన్నారు. లాక్ డౌన్ సమయంలోనూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం ఏర్పాట్లు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వరిధాన్యం పండించడంలో దేశంలోనే నెంబర్‌వన్‌ తెలంగాణ అని, రైతు వేదికలో నిత్య చైతన్య జ్వాల వెలగాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని కేటియార్ వెల్లడించారు.

తెలంగాణాను కేసియార్ ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని స్పష్టం చేశారు. కేసీయార్ ను గెలవాలంటే ఆయన్ను మించి తెలంగాణాను ప్రేమించాల్సి ఉంటుందని విపక్షాలకు చురకలంటించారు. కేసీయార్ నాయకత్వంలోనే తెలంగాణా ప్రత్యేక రాష్రం ఆవిర్భవించిన విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని హితవు పలికారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని. కేసీఆర్‌ పాలనలో ఊహించని అభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్