CM Jagan Dedicated 1st Phase Mana Badi Nadu Nedu To The Government School Students :
విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే నేటి నుంచి స్కూళ్లు తెరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని, గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్నప్రాంతాల్లో విద్యా సంస్థలను నేటి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను తెరుస్తున్నామని, పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ లో నాడు-నేడు కింద జరిగిన స్కూలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. విద్యా శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను సందర్శించారు. క్లాస్ లోని బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్ధులకు అందిస్తున్న పాఠ్య పుస్తకాలను, విద్యాకానుక కిట్ ను పరిశీలించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద బై లింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్‌బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ అందజేశారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాటాడుతూ రెండు సంవత్సరాలుగా విద్యా రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యెక దృష్టి పెట్టిందని, మనబడి – నాడు నేడు, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, లాంటి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మొత్తం 16,025 కోట్ల రూపాయలతో మూడు దశల్లో నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాతశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మొదటి దశలో 3,699 కోట్ల రూపాయలతో 15,715 స్కూళ్ళలో ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, వేణుగోపాల కృష్ణ, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : తల ఎత్తి నిలిచిన ఒలింపిక్స్ హెడ్డింగులు