to stop Land Disputes: భూ వివాదాల శాశ్వత నివారణకే వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మనం రూపాయి రూపాయి దాచుకుని, రాత్రనకా పగలనకా సంపాదించుకుని ఒక ప్లాటో, ఇళ్లో కొంటే అది భూవివాదాల్లోకి వెళ్లిపోతే ఎలాంటి బాధ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితులు పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి, మంచి చేయాలి అన్న తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’ అన్నారు.
ఈ పథకం ద్వారా మొదటి దశలో 51 గ్రామాలలో భూములు రీసర్వే చేసి, అభ్యంతరాలను పరిష్కరించి, ఆయా భూమి రికార్డులను క్యాంప్ కార్యాలయం నుంచి సిఎం జగన్ ప్రజలకు అంకితం చేశారు.
ప్రతి గ్రామంలో కూడా అన్ని రకాల సర్వేలు పూర్తి చేసి, అన్ని రకాల వివాదాలు పరిష్కరించి, భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా చేస్తున్నామని సిఎం అన్నారు. కేవలం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాకుండా గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులోనే ఆస్తుల లావాదేవీలు వారి కళ్ళకు కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇదోక పెద్ద సంస్కరణ అని, దీనిని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.
‘కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద ఇలా సరైన వ్యవస్థ లేకపోవడం, టాంపరింగ్, ఇతరత్రా లోపాల వల్ల చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదు’ అని సిఎం వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ(సర్వే సెటిల్మెంట్స్) కమిషనర్ సిద్ధార్ధ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ డైరక్టర్ ఎం ఎం నాయక్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి రామకృష్ణ, ఏపీఎండీసీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : మొదటి విడత రీ సర్వే పూర్తి: ప్రజలకు అంకితం