Sunday, September 8, 2024
HomeTrending News9 లక్షల మందికి ‘జగనన్న తోడు’: సిఎం

9 లక్షల మందికి ‘జగనన్న తోడు’: సిఎం

చిరు వ్యాపారులను ఆదుకునేందుకే ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రెండో విడతలో ఈ పథకం కింద చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికీ 10 వేల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మందికి రూ.370 కోట్లను తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి చిరు వ్యాపారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

తన పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు స్వయంగా చూశానని, వారికి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదని, బైట వారు 10 రూపాయల వడ్డీకి రుణం తీసుకుంటున్నారని, వారి కష్టాలు గమనించే వారిని ఆదుకునేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశామని జగన్ చెప్పారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని వివరించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చామన్నారు.

అర్హత ఉండి, ఈ పథకం కింద రుణం పొందలేని వారు కంగారు పడాల్సిన అవసరం లేదని, గ్రామ సచివాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవచ్చని, వారికి వచ్చే విడతలో రుణ సౌకర్యం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సకాలంలో వడ్డీ చెల్లించేవారికి తిరిగి వారి ఖాతాల్లోకే ప్రతి మూడు నెలలకోసారి జమ చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

తోపుడుబండ్ల మీద అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు పెట్టుకునేవారు, కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, గంపలు, బుట్టలు అమ్ముకునేవారు, ఇత్తడి పని, కొండపల్లి, ఏటికొప్పాక, కళంకారీ, తోలు బొమ్మల వృత్తి కళాకారులకు, కుమ్మరి పని చేసుకునేవారికి కూడా ఈ పథకం కింద రుణ సౌకర్యం అందిస్తున్నట్లు జగన్ వివరించారు. ఈ కార్యక్రమం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగు నింపాలని సిఎం జగన్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్