ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో గిరిజనులకు ఎంతో గౌరవం, గుర్తింపు లభిస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పుష్ప శ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో గిరిజనులు అంధకారంలో మగ్గిపోయారని, గిరిజనులకు అయన ఏనాడూ గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఒక గిరిజన ఎమ్మెల్యే చనిపోతేనే సానుభూతి కోసం అయన కుమారుడికి మంత్రిపదవి ఇచ్చారని, కేవలం రాజకీయ కోణంలోనే ఆ నియామకం చేశారు కానీ, అభిమానంతో కాదని ఆమె గుర్తు చేశారు.
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ గా విజయనగరం జిలా జడ్పీ మాజీ ఛైర్మన్ డా. శోభా స్వాతి రాణి ప్రమాణ స్వీకారం చేశారు, ఈ కార్యక్రమానికి శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డా. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో సిఎం జగన్ పని చేస్తున్నారని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారని, గిరిజన ప్రాంతాల్లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.