Babu-Manage Politics: తెలుగుదేశం పార్టీ కి 40ఏళ్ళు కాదని కేవలం 27 ఏళ్ళు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన టిడిపి ఎన్టీఆర్ తోనే పోయిందని, ఇప్పుడున్నది బాబు టిడిపి అని విమర్శించారు. తెలుగుదేశం ఆవిర్భవించి నేటికి 40ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిపై సజ్జల స్పందించారు. లక్ష్మీ పార్వతిని అడ్డు పెట్టుకొని, వెన్నుపోటు రాజకీయాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చందబాబుదని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
కుట్రలతో ఎలా అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు టిడిపి విధానమని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో అయన దిట్ట అని విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమయ్యారని, వారిలో మళ్ళీ ముగ్గురు నలుగురు విడిగా కూర్చుంటున్నారని, ప్రస్తుతం టిడిపి అవసానదశలో ఉందని సజ్జల చెప్పారు. మీడియాను మేనేజ్ చేసి, ప్రచారంతో ఇప్పటివరకూ చంద్రబాబు రాజకీయాలు చేశారని, కానీ తమ పాలన చూసిన తరువాత ప్రజలలో సిఎం జగన్ పట్ల ఆదరణ మరింత పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను రెండేళ్ళలోనే నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని, కోవిడ్ కష్ట సమయంలోనూ ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకున్నామని సజ్జల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, చంద్రబాబు ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి వెళ్ళిన విషయాన్ని దాచి పెట్టి అప్పు అంతా తమ హయాంలోనే తీసుకు వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో చేసిన వేల కోట్ల రూపాయల అప్పులను తమ ప్రభుత్వం తీర్చిందన్నారు.
Also Read : ఇది చంద్రబాబు కుట్రే: పెద్దిరెడ్డి విమర్శ