రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 22న గురువారం అయన కుప్పంలో పర్యటించి వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్ధిక సాయాన్ని లబ్దిదారుల అకౌంట్లలో జమ చేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే రేపు అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు. ప్రభుత్వం అనేక బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదించాల్సి ఉంది, దానికి తోడు వ్యవసాయ రంగంపై స్వల్పకాలిక చర్చను చేపట్టాలని నిర్ణయించారు. దీనితో ఎల్లుండి బదులు శుక్రవారం కుప్పంలో సిఎం పర్యటన ఉంటుంది.
రాష్ట్ర విద్యుత్, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుప్పం ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ లు కుప్పంలోనే మకాం వేసి సిఎం టూర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అసెంబ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని సిఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. దానికోసం ఈ బహిరంగ సభ నుంచే నాంది పలుకుతామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా సిఎం బహిరంగ సభను విజయవంతం చేసి తమ బలం ప్రదర్శించాలని పెద్దిరెడ్డి, భరత్ లు ఈ టూర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.