No interest: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ 15 రోజులకోసారి సమీక్షలు చేస్తుంటే, రాష్ట్ర ప్రాజెక్టులపై సిఎం జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జలం కోసం జన పోరు యాత్ర’లో భాగంగా 2వ రోజు తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టును ఆ పార్టీ నేతలు సందర్శించారు.
ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న తోటపల్లి, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై రివ్యూ చేసి పనులు పూర్తి చేయించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపించడం లేదని విమర్శించారు. ప్రాజెక్టులపై సమీక్షించే తీరిక సిఎంకు లేకపోవడం ఉత్తరాంధ్ర రైతాంగం దురదృష్టమని వ్యాఖ్యానించారు.
పొరుగున ఉన్న ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి జంఝావతి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిస్తే సుమారుగా 40 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ యాత్రలో సోము తో పాటు రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : పోలవరం పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి హామీ