Monday, May 20, 2024
HomeTrending Newsపోలవరం పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి హామీ

పోలవరం పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి హామీ

Polavaram Visit: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు వ్యవసాయంతో పాటు ఇతర జీవనోపాధి మార్గాలపై కూడా దృష్టి సారించాల్సి ఉందని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి త్వరలో ఓ  నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు  కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి అభినందించారు.  కాలనీల్లో ఇళ్ళ నిర్మాణంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కువ కాలం మన్నేలా ఇళ్ళ నిర్మాణం ఉండాలని సూచించారు.

సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పోలవరం ప్రాజెక్టు,  పునరావాస కాలనీల్లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి తొలుత తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు -1 కాలనీలోని  నిర్వాసితులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. అంతకు ముందు అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.  పోలవరం నిర్వాసితుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి  వాటిని పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అధికారులను ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి  జీవనాడి అని, ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సిఎం జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో  పూర్తి చేస్తామని, తద్వారా గోదావరి డెల్టా తో పాటు, కృష్ణ డెల్టా ప్రాంతానికి కూడా అదనపు ప్రయోజనం కలిగిస్తుందని, తద్వారా రాష్త్రానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఊతమిస్తుందని పేర్కొన్నారు. గతంలో తాను నిర్వాసితులకు, రైతులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయని వాటిని త్వరలో నెరవేర్చేందుకు కృషి చేస్తానని  భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసం తొలి నాళ్లలో  భూములిచ్చిన రైతులకు కూడా న్యాయం చేస్తానని చెప్పానని. ఈ హామీని కూడా నిలబెట్టుకుంటానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్