ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మరోసారి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తులాభారం మొక్కు తీర్చుకున్నారు. సీఎంకు ఆలయం వద్ద టీడీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి స్వగతం పలికారు. వేదం పండితులు సిఎంకు ఆశీర్వచనం అందించారు.
శ్రీవారి దర్శనం తర్వాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామి వార్లను కూడా సిఎం దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును సిఎం ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ, హిందీ భాషల ఛానళ్లను సిఎం జగన్ లాంచనంగా ప్రారంభించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న(సోమవారం) స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బర్డ్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులను, గో మందిరాన్ని కూడా సిఎం ప్రారంభించి గో మాతకు ఆహారం అందించారు.