I don’t Care: దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరినైనా ఎదుర్కొంటానని, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టినా దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమం ద్వారా 2021 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ నిధులను రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో సిఎం జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు.
కోనసీమ క్రాప్ హాలిడే పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 2,977 కోట్ల రూపాయల మేర రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తుంటే దాన్ని తక్కువ చేసి చూపడం కోసం క్రాప్ హాలిడే అంటూ విష ప్రచారం మొదలు పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఆలస్యమైనా రైతులు ఇబ్బంది పడకూడదని ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే వారి డబ్బులు వేస్తున్నందుకా? గత ప్రభుత్వం ఇవ్వకుండా పోయిన ధాన్యం బకాయిలు తాము తీర్చినందుకు క్రాప్ హాలిడే ప్రకటించారా అని ప్రశ్నించారు. రైతులకు ఇంతగా మేలు తాము చేస్తుంటే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తారో చెప్పాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను డిమాండ్ చేశారు.
కోనసీమ జిల్లాకు మహానుభావుడు అంబేద్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేక, కడుపు మంటతో అల్లర్లు సృష్టించారని, ఓ దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చివేశారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా సామాజిక న్యాయానికి వారిచ్చే గౌరవం అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 67శాతం మంది పాస్ అయ్యారని, కోవిడ్ వల్ల ఒక్క పరీక్ష కూడా రాయకుండానే రెండేళ్ళ పాటు అందరినీ పాస్ చేశామని గుర్తు చేశారు. దీనివల్ల పిల్లల చదువులు ఏమవుతాయని, వారికి క్వాలిటీ విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక్కడ 67 శాతం ఉత్తీర్ణత సాధిస్తే గుజరాత్ లో 65శాతం మందే పాస్ అయ్యారని పేర్కొన్నారు. మన విద్యార్ధులు విద్యాసంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతోనే సప్లిమెంటరీ, కంపార్ట్ మెంటల్ పాస్ అనేది తీసేశామని వివరించారు. పిల్లలకు ఆత్మ స్థైర్యం ఇచేలా వ్యవహరించాలని కానీ వారిని రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదన్నారు. ఉద్యోగులకు కూడా ప్రభుత్వం చేయగలిగినంత మేలు చేస్తోందని, కానీ వారిని కూడా రెచ్చగొట్టే దిక్కుమాలిన పనులు చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి నేతలు అసలు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని జగన్ నిలదీశారు.
చంద్రబాబుకు మేలు చేసేందుకే ఆయన దత్తపుత్రుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారని జగన్ విమర్శించారు. ప్రభుత్వం పేదలకు ఏదైనా మేలు చేస్తుంటే, మంచి పని చేస్తుంటే ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండడం కోసం దుష్ట చతుష్టయం నానా పాట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు పరిహారం అంటూ దత్తపుత్రుడు జిల్లాలు తిరుగుతున్నాడని, తమ పాలనలో పట్టాదారు పాస్ పుస్తకం ఉండి, పరిహారం అందని ఒక్క కుటుంబాన్ని చూపించాలని దత్తపుత్రుడికి సవాల్ చేస్తే స్పందించలేదని సిఎం ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవాల్సిన పరిహారం ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు ఆత్యహత్యకు పాల్పడిన 458 కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. అప్పుడు ఎందుకు జిల్లాల యాత్రలు చేయలేదని పవన్ ను పరోక్షంగా జగన్ ప్రశ్నించారు.
గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలు, విత్తనాలు, పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ నిధులకు సంబంధించి బకాయిలు ఇవ్వకుండా వెళితే తాము వాటిని చెల్లించామని సిఎం జగన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో, తమ హయాంలో రైతులకు జరుగుతున్న మేలును గమనించాలని, వారి పాలనకు, తమ పాలనకు తేడా అర్ధం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read : క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి: సిఎం ఆదేశం