మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో మొక్కనాటి ‘జగనన్న పచ్చ తోరణం – వన మహోత్సవం 2021’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (ఆగస్ట్ 5) ప్రారంభించనున్నారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపడుతున్నారు.
గత రెండు సంవత్సరాలలో 33.23 కోట్ల మొక్కలు నాటామని, ఈసారి కూడా అదే ఉత్సాహంతో విరివిగా మొక్కలు నాటుదామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆకుపచ్చని ఆంధ్రావని లక్ష్యంగా ప్రతీ ఒక్కరం మొక్కలు నాటుదామని, పచ్చని పుడమిని భావితరాలకు అందిద్దామని బాలినేని పిలుపునిచ్చారు.
మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణను కూడా బాధ్యతగా స్వీకరిద్దామన్నారు. 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలలో మొక్కలు నాటుతున్నట్లు బాలినేని తెలిపారు. నరేగా కింద దాదాపు 75 లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా స్కూళ్ళు, ఆసుపత్రులలో మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపొందించడం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశమని, జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించడం, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.