Saturday, July 27, 2024
Homeసినిమాఅమ్మ తీసుకెళ్ళిన సినిమా

అమ్మ తీసుకెళ్ళిన సినిమా

The First Talking Motion Picture Kalidas Released In 1931 October 31st:

మా అమ్మానాన్నల్లో అమ్మ బాగానే సినిమాలు చూసేది. నాకు ఊహ తెలిసి మా నాన్నగారు చూసిన సినిమాలు రెండు. అవీనూ ప్రివ్యూలే. ఒకటి స్వర్ణగౌరి. మరొకటి వీటూరి గారు మాటలు రాసిన శ్రీరామకథ. నాటి సినిమా రచయితలు, దర్శకులు, నిర్మాతలు, కొందరు నటీనటులతో పరిచయాలున్నా మా నాన్నగారు థియేటరుకి వెళ్ళి సినిమా చూసినట్టు నాకు గుర్తులేదు. ఇవికాక మరేవైనా సినిమాలు చూశారా అనేది నాకైతే తెలీదు. కానీ అమ్మ అనేక తమిళ సినిమాలకు వెళ్తుండేది. అప్పుడప్పుడూ మమ్మల్నీ తీసుకెళ్ళేది. అయినా మమ్మల్ని సినిమాలకు మా మూడో అన్నయ్య ఆంజీతో పంపేది. మా పెద్దన్నయ్యతో నేను చూసిన తొలి ఇంగ్లీష్ సినిమా చార్లీ చాప్లిన్ నటించిన “లైమ్ లైట్”.

అలాగే మా అమ్మతో కలిసి నేను చూసిన తమిళ సినిమా మహాకవి కాళిదాస్. 1966 ప్రాంతంలో వచ్చిన సినిమా. మైలాపూరులోని కామధేను థియేటర్లో చూసినట్టు గుర్తు. ఆర్వా. ఆర్గ. చందిరన్ (చంద్రన్ పేరుని తమిళంలో ఇట్టానే రాస్తారు) దర్శకత్వంలో శన్, షావుకారు జానకీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ గారు. నాకా సినిమా కథ అస్సలు గుర్తు లేదు కానీ తమిళం చదవడానికి ఈ సినిమానే మూలకారణం. తెరమీది టైటిల్స్ చదవమని మా అమ్మ అడిగితే నాకు రాదన్నాను. అప్పుడు మా అమ్మ రాకపోవడమేమిటి, ” చదవాలి తమిళం ” అని చెప్పడంతో మరుసటి రోజు నించే చదవడం మొదలుపెట్టాను. గోడలమీద అతికించిన సినిమా వాల్ పోస్టులలో కనిపించే అక్షరాలను

తమిళ మిత్రులతో సాయంతో చదవడం నేర్చుకున్నాను. అలాగే క్రమంగా దినత్తంది (తమిళ దినపత్రిక) చదవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత తమిళ పుస్తకాలు! ఇప్పటికీ నేను చదివే పుస్తకాలు తమిళమే. తెలుగు కన్నా తమిళ పుస్తకాలే  నా దగ్గర ఎక్కువగా ఉన్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే, శివాజీ “కాళిదాసు”గా  నటించిన సినిమా కన్నా ముందే కాళిదాస్ అనే టైటిల్ తో మరొక సినిమా తమిళంలో విడుదలైంది. తమిళంలో  అదే తొలి టాకీ సినిమా. అంతేకాదు, దక్షిణ భారత దేశంలో 1931లో విడుదలైన తొలి టాకీ సినిమా ఇదే కావడం విశేషం.

The First Talking Motion Picture Kalidas

దాదాపు తొంబై ఏళ్ళ క్రితం విడుదలైన ఈ చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు ఎనిమిది వేల రూపాయలు. అయితే ఈ చిత్రంవల్ల నిర్మాత పొందిన డబ్బు 75,000 వేల రూపాయలు. 1931 అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రంలో యాభై పాటలున్నాయి. క్రీ.శ. మూడో శతాబ్దానికి చెందిన సంస్కృత మహాకవి కాళిదాసు శాకుంతలం, మేఘదూతం, కుమారసంభవం వంటి కావ్యాలు రాయడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ కవిపై తీసిన ఈ తమిళ చిత్రంలో అక్కడక్కడా తెలుగు, హిందీ భాషలలోనూ సంభాషణలుండటం గమనార్హం. ఈ చిత్రంలో పీ.జీ. వెంకటేశన్, టి.పి. రాజలక్ష్మి. తేవారం రాజాంబాళ్, సుశీలా దేవి, జె. సుశీలతదితరులు  ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాలో పాటలు రాయడం ద్వారా తొలి తమిళ గేయరచయితగా మధురకవి భాస్కరదాస్ చరిత్రపుటలకెక్కరు.

Ardeshir Irani గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు మన తెలుగువారు కావడం విశేషం. దర్శకుని పేరు హెచ్.ఎం.రెడ్డిగారు. తమిళ, తెలుగు భాషలలో తీసిన చిత్రమిది. 1930 లలో తీసిన చిత్రాల ప్రింట్లు చాలా వరకు ఇప్పుడు లేకుండాపోయాయి. వాటిలో ఈ తమిళ కాళిదాసు చిత్రమొకటి కావడం విచారకరం. తెలుగులో ఇప్పుడీ సినిమా అందుబాటులో ఉందో లేదో నాకు తెలీదు.

– యామిజాల జగదీశ్

Also Read : చదివి రాయాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్