Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Boy accidentally hangs himself while re-enacting Bhagat Singh’s execution

జీవితంలో ఓ నాటకం వేస్తున్నానని సంతషించాడేగానీ.. జీవితమనే నాటకంలో.. తానెంచుకున్న పాత్రే జీవిత చరమాంకమవుతుందని ఊహించలేకపోయాడా బాలుడు. ఉత్తరప్రదేశ్ లో ఓ పదేళ్ల బాలుడికి నాటకం రిహాల్సల్సే… చివరి మజిలీగా మారిన విషాదగాధ ఇది! అంతేకాదు… ఏవి కూడదో.. నేర్పాల్సిన పెద్దలు పట్టించుకోకపోతే జరిగే అనర్థాలకు ఓ పరాకాష్ఠ ఈ సంఘటన.

సమాజాన్ని బాగా ప్రభావితం చేసేవి పుస్తకాలు, పత్రికలు, నాటకాలు, సీరియళ్లు, టీవీ కార్యక్రమాలు, సినిమాలు. ఈరోజుల్లో అయితే మోబైల్, అందులోని ఇంటర్నెట్ కూడానూ! అయితే గతంలోలా పుస్తకాలు, పత్రికలు, నాటకాల పాత్ర కాస్త కుచించుకుపోయి పరిమితమైపోగా… మిగిలినవాటి హవా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలోనే ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టుగా వచ్చిపడ్డ ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇంటికే ఒటీటీ రూపంలో నడిచొచ్చిన సినిమా థియేటర్ వంటి వాటి ప్రభావం మరింతెక్కువైంది. అయితే వీటన్నింటికీ మళ్లీ ప్రేరణ కూడా ఈ సమాజమే. ఇది ఒక్కమాటలో చెప్పాలంటే ఇచ్చిపుచ్చుకునే మ్యూచువల్ ప్రాసెస్… ఆర్థిక లావాదేవీల పరిభాషలోనైతే క్విడ్ ప్రో కో సంబంధం.

ఇదంతా ఎందుకిప్పుడు చెప్పుకోవడమంటే.. ఎక్కడో జరిగిన ఓ విషాదం తాలూకు విషయమైనా… ఇకముందైనా ఇలాంటివి జరక్కుండా చూసుకునేందుకు యూనివర్సల్ గా ప్రస్తావించుకోవాల్సిన సమయం గనుక!

యూపీలోని బబాట్ అనే గ్రామానికి చెందిన పదేళ్ల శివరామ్ అనే యువకుడు ఓ నాటకం కోసం రిహాల్సల్స్ చేస్తూ మృతిచెందిన ఘటన కలకలం రేపింది గనుక. రాబోయే పంద్రాగస్ట్ రోజు స్కూల్ లో వేయబోయే ఓ నాటకంలో శివరామ్ ది భగత్ సింగ్ క్యారెక్టర్. భగత్ సింగ్ ను ఉరి వేసే సీన్ ని… ఇతర తోటి విద్యార్థులతో కలిసి శివరాం ప్రాక్టీస్ చేస్తుండగా.. కిందనున్న స్టూల్ జారిపోయి… తాడు బిగుసుకుని శివరాం తోటి విద్యార్థుల ముందే గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందిన ఘటన… శివరాం జీవితమనే నాటకంలో ఓ చరమాంకపు తీవ్ర విషాదం.

Boy Dies While Rehearsing Bhagat Singhs Hanging Scene

నాటకంలో పాత్రలలో పరకాయ ప్రవేశం చేసినవాళ్లను ఆహా ఎంత బాగా చేశారు.. జీవించేశారని మెచ్చుకుంటుంటాం. కానీ జీవించాల్సిన చోట జీవించాలనే విషయం తెలియని పసివయస్సది. భగత్ సింగ్ క్యారెక్టర్ లో ఉరి తీసిన సన్నివేశం అంతగా ఇన్ స్పైర్ చేసుంటుంది కూడా! రిహాల్సల్స్ లో భగత్ సింగ్ పాత్ర పోషణలో ఉరి ఘట్టమే కీలకమేం కాదనే పరిపక్వత రాని బాల్యమది. అందుకే తోటి విద్యార్థులతో శివరామ్ ఉరి సన్నివేశాన్నే రిహాల్సల్ కు ఎంచుకున్నాడు. చివరకు అందరి కళ్లముందే విగతజీవిగా వెళ్లిపోయాడు. నాటకం కంటే ముందే రిహాల్సల్ లోనే భగత్ సింగ్ లా ఉరికొయ్యలపాలయ్యాడు. మొత్తంగా ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చాడు.

అయితే ఇక్కడెవ్వరిది తప్పు… ఏది చేయాలో, ఏది కూడదో తెలియని పసిబుగ్గల ఆ పసివాడిదా…? ఆ నాటకమెంచుకోవడమా…? అందులోనూ ఉరి సన్నివేశమే కీలకమైన భగత్ సింగ్ వంటి క్యారెక్టర్ ను ఎంచుకోవడమా…? కాదు… ముమ్మాటికీ ఆ నాటకాన్ని వేయమని చెప్పి రిహాల్సల్స్ సమయంలో అక్కడలేని నిర్వాహకులదే తప్పు. అది గురువులైనా… ఇతర పర్యవేక్షకులైనా శివరాం మరణంలో దోషులే! పిల్లలతో దేశభక్తికి సంబంధించి కావచ్చు, మైథాలజీ కావచ్చు, సాంఘిక నాటకాలే కావచ్చు… ఏవి వేయించినా, ఏది చేయించినా… ఏది కూడదు, ఏది చేయాలో తెలియజెప్పాల్సిన బాధ్యత మాత్రం ముమ్మాటికీ పెద్దలదే.

కానీ శివరాం నాటకపు ఎపిసోడ్ లో అదే లోపించింది. అందుకే నాటకంలో జీవించేందుకు రిహాల్సల్స్ తో తపన పడుతూ… జీవితమే లేకుండా పోయింది.

ఇప్పటికైనా ఇలాంటి నాటకాలు వేసే సమయాల్లోనే కాదు… పిల్లల్ని అమితంగా ప్రభావితం చేస్తున్న టీవీలు, మోబైల్స్, నేటి ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివాటిపై పెద్దలు ఎంత జాగ్రత్త వహిస్తే అంతమేలన్న ఓ నీతి మాత్రం శివరాం విషాదపు ఎపిసోడ్ లోంచి మిగిలిన సమాజం గమనించాల్సి ఉంది.

-రమణ కొంటికర్ల

Also Read:తపాలావారి నిమజ్జన సేవ

Also Read: గోడలు చెప్పే పాఠాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com