Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Rang De Basanti : Relive the long forgotten saga of freedom

స్వాతంత్ర్య ఫలాలను తేలిగ్గా అనుభవిస్తూ, ఈజీగోయింగ్ బతుకుల్ని బతికేస్తున్న జీవితాలను చెంప చెళ్లుమనిపించిన సినిమా రంగ్ దే బసంతి.

బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రకారిణి స్యూ మెకన్లీ దృక్కోణంలో భారత స్వాతంత్ర్య సంగ్రామం చిత్రీకరణ, ఆ క్రమంలో ఇప్పటి నవతరపు దృక్పథం దేశం పట్ల బాధ్యత వైపు మరలడం చిత్రకథాంశం.

భారతీయ ప్రేక్షకులు త్వరితగతిన కాలం కన్నా వేగంగా మారుతున్నారు. కథాకథనాల్లో దమ్మున్న వైవిధ్యమైన సినిమాలు ఎప్పుడైనా సంచలనవిజయాలు నమోదు చేస్తాయి.

రెండు ‌టైంజోన్లలో కథని చెప్పడం ద్వారా దర్శకుడు రాకేష్ ఓం‌ప్రకాశ్ మెహ్రా అద్భుతమైన ఎత్తుగడ వేశారు. తన ఆక్స్ పరాజయం తర్వాత తాను నేర్చుకున్న పాఠమది.

సైమన్ గో బ్యాక్ ‌అంటూ శాంతియుత ప్రదర్శన చేసిన లాలాలజపతిరాయ్ మీద అప్పటి పోలీస్ దౌర్జన్యం, తదనంతరం అతని మరణం క్రాంతికారుల పోరాటాన్ని ఉద్దీపనం చేస్తే..,

మిగ్ పైలట్ మాధవన్ ప్రమాదవశాత్తూ జరిగిన మరణం సమకాలీన కుర్రవాళ్లని పోరాటయోధులుగా మారుస్తుంది.

అంతకుముందు వచ్చిన మదరిండియా, మనోజ్ కుమార్ల‌ సినిమాల ప్రభావం తగ్గిందనీ, గదర్ తరహా అరుపుల కన్నా, నిశ్శబ్దం ఎక్కువగా చప్పుడు చేస్తోందనీ, సమకాలీన భారతం పాశ్చాత్యుల కన్నా ఎక్కువగా వెస్టర్నైజ్ అయ్యిందనీ కథారచయిత పట్టేశాడు.

ఎంత గొప్ప కథలైనా, అమీర్ ఖాన్ తీసిన మంగళ్ పాండే, ఓ అరడజను పైచిలుకు భగత్ సింగ్ ఆత్మకథా చిత్రాలు అంతకు ముందే బాక్సాఫీస్ దగ్గర చీదేశాయి. ప్రేక్షకుడి పంచేంద్రియాలూ, పంచ జ్ఞానేంద్రియాలనూ ఎంగేజ్ చేయని సినిమా బతికి బట్టకట్టడం కష్టం. వాళ్ల మూడ్ నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి సినిమా సక్సెస్ కి ఓ నిర్ధిష్టమైన ఫార్ములా ఉండదు.

 15 years of Rang De Basanti

ఈ ‌సినిమాలో హెరిటేజ్ స్థలం దగ్గర పార్టీ చేసుకుంటూ, అదిలించిన పోలీసులకు లంచమిచ్చిన డీజే, లంచగొండి ‌రక్షణమంత్రిని హత్య చేస్తాడు. డిగ్రీ ఐన మరుక్షణం అమెరికాకి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డ ఇంకో హీరో ఆయుధదళారీ ఐనా తన కన్నతండ్రిని చంపేస్తాడు. మనలో చాలామందిలో ఈ విలువల ద్వైద్వీభావనులుంటాయి.

అమీర్ ఖాన్ తో కాలేజీ దాటాక మా ‌బతుకులు గుంపులో గోవిందాలు, అందుకే నేను కాలేజీని వదలకుండా పట్టుకుతిరుగుతున్నానంటూ స్యూ మెకెన్లీకి ఇప్పించిన కన్ఫెషన్ అమీర్ ఖాన్ విద్యార్థి గా ఉండడాన్ని జస్టిఫై చేసుకుంటూ దర్శకుడు వేసిన తెలివైన ఎత్తుగడ. ఇది జల్సా సినిమాలోకి సమర్ధవంతంగా ఎత్తిపోతలైంది.

అతుల్ కులకర్ణి రామ్ ప్రసాద్ బిస్మిల్ గా; కునాల్ కపూర్ అష్వాఖుల్లాఖాన్ గా స్వాతంత్ర్య సంగ్రామంలో మతవిబేధాలతో కలిసి పోరాడి చనిపోతారు. సమకాలీనంలో కూడా అదే జరుగుతుంది. తద్వారా హిందూ ముస్లింలు కలిసి బతికి కలిసి ఛావక తప్పదనే ఓ అంతర్లీన సందేశం ఇచ్చాడు.దేశం పర్ఫెక్ట్ గా ఉండాలంటే ప్రజలు పర్ఫెక్ట్ గా ఉండాలనడం తిరుగులేని పాయింట్. అవసరమైనప్పుడు ఎలాంటి ప్రజానీకమైనా, తమనుతాము సరిదిద్దుకుని పర్ఫెక్ట్ గా మారతారనే ఆశావాహదృక్పథం ఇంకా తిరుగులేని పాయింట్. ఈ ‌ప్రధాన సూత్రానికి కలిపిన అదనపు హంగులు..

1) లాలాలజపతిరాయ్ లా మాధవన్ నీ, ఇతర క్రాంతికారులుగా మిగతా ప్రధాన తారాగణాన్ని వివిధ నేపథ్యాలనుండి తీసుకోవడం..
2) భారతమాత ప్రతీకలా వహీదా రెహమాన్ ని చూపడం..
3) పార్టీల జెండాలు వేరైనా, వాటి ఎజెండా ఒక్కటే అని చెప్పడం
4) నాయకులు కార్యకర్తలని ఎలా కరప్ట్ చేస్తారో చూపడం..
5) ఏ రాజ్యమైనా ధిక్కారాన్ని సహించదు, ఉక్కు పాదంతో అణచివేస్తుందని చెప్పడం..
6) పరాయి పాలన పోవాలంటే హింస తప్పదేమో కానీ, స్వపరిపాలనలో హింస మార్గం కాదు, పాలనలో భాగమై మాత్రమే వ్యవస్థలను సంస్కరించుకోగలమని ముందు మాధవన్ తో, చివర్లో సిద్ధార్థ్ తో చెప్పించడం..
7) ఉదాత్తమైన ఆశయం ఉన్నప్పుడు మరణాన్ని ఏ తరమైనా చిరునవ్వు నవ్వుతూ స్వీకరించగలదని చెప్పడం..

పాత సినిమాలు కొన్ని కొత్తవెలా రాయాలో నేర్పితే, మరికొన్ని కొత్తవెలా తీయకూడదో నేర్పుతాయి. ROM లాంటి సృజనాత్మక రూపశిల్పి దేశభక్తి ఎవర్ గ్రీన్ సబ్జెక్టే ఐనా, అప్పట్లో వచ్చిన ఫెయిల్యూర్ రొద సినిమాలని చూసి తననుతాను పునరావిష్కరించుకున్నాడు.

సగటు ‌సినిమాల్లోలా ‌దేశ రక్షణమంత్రి ని హత్య చేసిన తర్వాత మన ‌హీరోలు హీరోలు కారు. వాళ్లు అతన్ని హత్య చేసిన ఉద్దేశపు పరిణామాలేవయినా ప్రపంచానికి తెలియాలనుకుంటారు. రక్షణమంత్రిని ప్రభుత్వం, మీడియా అమరవీరుడనడాన్ని జీర్ణించుకోలేక పోతారు. జరిగిన వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయడానికి రేడియోని వాహకంగా వాడుకుంటారు. మనం వాళ్ల‌ నిజాయితీతో ప్రేమలో పడతాం. రాజ్యం వాళ్లందరినీ నిష్కర్షగా హతమార్చి మనల్ని విషాదంలో ముంచుతుంది..! అదో కవితాత్మకమైన ముగింపు.

రాజ్యాధికారం తెల్లదొరల చేతుల్లోనుండి, మన స్థానికదొరల చేతుల్లోకి మారిందనీ, సామాన్యుడు ప్రభువైనా,‌ వాడు దొరలా మారి మనల్ని అణగదొక్కుతాడన్న నిజాన్ని నిర్వేదంగా చెబుతూనే భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచే గమ్మత్తైన కథ రంగ్ దే బసంతి.

-గొట్టిముక్కల కమలాకర్

Read More: సీతారామయ్యగారి మనవరాలు

Read More: ఫెయిల్యూర్ కథను గెలిపించిన కథనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com