Cabinet expansion: త్వరలో ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ మార్పు చేర్పులపై సిఎం తన సహచరులకు సమాచారమిచ్చినట్లు భోగట్టా. నేడు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ను ఆమోదించేందుకు నేటి ఉదయం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినేట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగానే మార్పు చేర్పుల అంశాన్ని సిఎం వెల్లడించినట్లు తెలిసింది.
2019 జూన్ 8న జరిగిన కేబినెట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కేబినేట్ ను రెండున్నరేళ్ళ తరువాత మారుస్తామని, 80శాతం కొత్తవారిని తీసుకుంటానని జగన్ ఆనాడే స్పష్టం చేశారు. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా దాదాపు రెండేళ్లపాటు తమకు పనిచేసే అవకాశం లేకుండాపోయిందని మంత్రులు సిఎం కు వెల్లడించారు. అందుకే ఆరు నెలలపాటు విస్తరణను వాయిదా వేశారని పార్టీ వర్గాల నుంచి తెలిసింది.
మరోవైపు ప్రస్తుతం ఉన్న మంత్రులలో దాదాపు అందరినీ మార్చాలని సిఎం జగన్ తొలుత భావించినా, సీనియారిటీ, సామాజిక సమీకరణలు, ప్రతిపక్షాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న వారిని పదవుల నుంచి తొలగిస్తే బాగుండదనే అంశాలను కూడా సిఎం ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో కనీసం ఆరుగురు లేదా ఏడుగురిని కొనసాగించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
ఈనెల 15న వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. చాలా కాలం తర్వాత జరుగుతున్న ఈ భేటీ లో సిఎం జగన్ వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసి, పనితీరు సరిచేసుకోవాల్సిందిగా కొందరు ఎమ్మెల్యేలకు సూచించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి: రైతు భరోసాకు 7వేల కోట్లు