గులాబ్ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ సీఎం జగన్ కు వివరించారు. సహాయక చర్యలపై సిఎం జగన్ ఆరా తీశారు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలని, ఇళ్ళలో నీరు చేరిన కుటుంబాలకు, ముంపు ప్రాంతాల బాధితులకు వెంటనే వెయ్యి రూపాయల తక్షణ సాయంకింద అందించాలని ఆదేశించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్‌ను పునరుద్ధరించే పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టలని అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని, పంట నష్టం అంచనా వేసేందుకు కూడా సన్నద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లలో పర్యటిస్తున్న సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా సిఎం విజ్ఞప్తి చేశారు. సహాయ శిబిరాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని, బాధితులకు నాణ్యమైన ఆహారం అందించాలని, రక్షిత మంచినీరు, వైద్యం అందించే విషయంలో ఎలాంటి వెనకడుగు వేయవద్దని సిఎం జగన్ ఆదేశించారు.
డిప్యుటీ సిఎం ధర్మాన కృష్ణ దాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస రావు ఆయా జిల్లాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.