Monday, June 15, 2026
HomeTrending NewsYS Jagan: ఇంటర్నెట్ తో ప్రభుత్వ సేవలు వేగవంతం

YS Jagan: ఇంటర్నెట్ తో ప్రభుత్వ సేవలు వేగవంతం

డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని, తద్వారా పాలనా వ్యవస్థలో పెనుమార్పులు రానున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లభిస్తుందని, రేషన్‌ పంపిణీ, ఇ–క్రాప్‌ బుకింగ్‌ కూడా సులభమవుతుందని స్పష్టం చేశారు.  రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు, 100 జియో టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్‌, జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతామన్నారు.

నేడు ప్రారంభించిన టవర్ల ద్వారా 209 మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు  సేవలు అందనున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్‌ జిల్లాలో 2 టవర్ల ఏర్పాటు చేశారు.
భవిష్యత్తులో 5జీ సేవలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్న జియో సంస్థ అంగీకరించింది.

రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులు ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ప్రభుత్వ సేవలు సులభంగా అందుతాయని అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) ద్వారా సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ సెల్‌ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉంది.  కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరిపి ఈ ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసింది. ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,463 చోట్ల స్థలాలు అప్పగించిన ప్రభుత్వం డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది.

కొత్తగాప్రారంభించిన సెల్‌టవర్ల ద్వారా మారుమూల ప్రాంతాలనుంచి నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular