Sunday, January 19, 2025
HomeTrending NewsFloods: లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై సిఎం సమీక్ష

Floods: లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై సిఎం సమీక్ష

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాత్రి పొద్దు పోయేవరకు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సీఎం కోరారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఫోన్లలో ఆదేశించారు.

తక్షణ రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్లు సహా, ఆహారం, వైద్యం తదితర రక్షణ సామాగ్రి, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు.
విపత్తుల నిర్వహణ శాఖకు, ఫైర్ సర్వీసుల శాఖకు, పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. అదే సందర్భంలో పోలీస్ యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాల్సిందిగా రాష్ట్ర డిజిపిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి డిజిపి పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తున్నది.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో, వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఇన్ ఫ్లో ను ముందస్తు అంచనా వేసి, గేట్లు ఎత్తివే స్థూ, వరద నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులు, కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణనష్టం జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

కడెం ప్రాజెక్టు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను ఆరా తీశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రేయింబవళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్