వాసాలమర్రి మొత్తం ఇవాళ్టి నుంచి తన కుటుంబమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామ సందర్శనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాసాలమర్రి అభివృద్ధికి గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేయాలి. సమస్య ఉంటే అందరం కలిసి సమిష్టిగా పోరాడితే సమస్యలు తొలగిపోతాయి. గ్రామంలో రెక్కల కష్టంపై బతికేవాళ్లకు అండగా నిలవాలని కెసిఆర్ పిలుపు ఇచ్చారు. గ్రామ అవసరాలు ఇక్కడ లభించే వనరుల ద్వారా తీర్చుకోవాలి. గ్రామస్తులంతా 2 గంటలు పని చేస్తే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. వాసాలమర్రికి బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ నిర్మిద్దాం. రోడ్లను బాగు చేసుకుందాం. ఎవరికి ఏం అవసరమున్నా మంజూరు చేసే బాధ్యత తనదని సిఎం భరోసా ఇచ్చారు. అందరూ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఊర్లోని మూడు దళితవాడలకు వెళ్లి వాళ్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కెసిఆర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు పథకాల గురించి వివరించే వాళ్లు ముందుకు రావాలి. రాబోయే రోజుల్లో గ్రామ నిధి ఏర్పాటు చేసుకుంటే కష్టమొచ్చిన వారికి అండగా నిలిచే అవకాశం ఉంటుంది. తొలుత గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. గ్రామ శ్రమదాన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. పరిశుభ్రత, తాగునీరు కమిటీ, హరితహారం కమిటీ, వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారి
వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమిస్తున్నాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రత్యేక అధికారి ఎవరో కాదు.. జిల్లా కలెక్టరే అని తెలిపారు. తల్లైనా, తండ్రైనా కలెక్టర్ పమేలా సత్పతినే. జిల్లా అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి కలెక్టర్ పనులు చేయిస్తారు. గ్రామ అభివృద్ధికి నూరో, నూట యాభై కోట్లు ఇస్తాం. ఆ నిధులు వినియోగించాలి. అప్పుడే అభివృద్ధి జరిగినట్టని సిఎం స్పష్టం చేశారు. గ్రామంలో జబ్బు పడిన వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కలిసి కమిటీలను ఏర్పాటు చేసి.. అభివృద్ధికి సహకరించాలి. చదువుకోని వారికి చదువుకున్న వారు సహకరించాలి. ప్రజల కోసం పని చేసే కలెక్టర్ మీకు ఉన్నారు. ఆమె సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.