Friday, March 29, 2024
HomeTrending Newsమూస ధోరణులు వద్దు : కేసియార్ హితవు

మూస ధోరణులు వద్దు : కేసియార్ హితవు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఏళ్ళు దాటినా పల్లెలు, పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మొదటి నుంచి నిర్లక్ష్యానికి గురవుతుండడం శోచనీయమన్నారు. ఇందుకు అధికార యంత్రాంగం మానసిక ధోరణికూడా ప్రబల కారణమని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇవాళ ప్రగతి భవన్ లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల (డిపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా వారు చేరుకున్న లక్ష్యాలను సిఎం సుధీర్ఘంగా సమీక్షించారు.

మూస ధోరణులు, వైఖరులను మార్చుకొని సామర్ధ్యాన్ని పెంచుకొని పట్టుదలతో కృషిచేసి గొప్పపేరు తెచ్చుకోవాలని కోరారు. తమకోసం పనిచేసే ఆదర్శవంతమైన కలెక్టర్లను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోదాహరణలతో సీఎం వివరించారు. గ్రామ సభలు నిర్వహించి, గ్రామ ఆర్ధిక నివేదికల మీద చర్చలు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాద్యత డిపీవోలదేనని సీఎం స్పష్టం చేశారు. పల్లె ప్రకృతి వనాలకోసం ప్రభుత్వ భూమి దొరకని పక్షంలో గ్రామ నిధులనుంచి ప్రయివేట్ భూమిని కొనుగోలు చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని కెసియార్ ప్రకటించారు. పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్ధులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సీఎం స్పష్టం చేశారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని అదనపు కలెక్టర్లకు డిపివోలకు సీఎం మరోసారి తేల్చి చెప్పారు.

జూన్ 20 న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలుంటాయని సీఎం తెలిపారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో సీఎం ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి గొప్పగా పనిచేస్తున్నయని, అయితే ప్రతి సీజన్ లో సీజన్ ప్రారంభానికి ముందే వైద్యశాఖతో అటు పంచాయితీరాజ్ శాఖ ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కలిసి కూర్చోని వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ విధానాన్ని ఒక పని సంస్కృతిగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రజల వైద్యం, ఆరోగ్య విషయంలో అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు.

పట్టణాలల్లో పూర్తి స్థాయిలో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయాలని, దీని వల్ల విద్యుత్ బిల్లుల ఖర్చు తక్కువగా రావడం సంతోషకరమని సీఎం అన్నారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్ లో డైనమిక్ అప్డేషన్ చేయాలన్నారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్