రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులతో ప్రగతి భవన్‌లో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. గోదావరి, ఉప నదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.