Thursday, March 28, 2024
HomeTrending Newsపవన్ రాజకీయ ప్రవచనకారుడు : పేర్ని నాని

పవన్ రాజకీయ ప్రవచనకారుడు : పేర్ని నాని

Pawan-Prophet: ఓ నాయకుడు వీకెండ్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారని, అది కూడా ఫోర్ట్ నైట్ సర్వీస్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రజల కోసమే నా జీవితం, దానికోసం నా సినిమాలు వదులుకుంటున్నానని చెప్పిన నేత ఇప్పుడు వీకెండ్ సేవ చేస్తున్నారని విమర్శించారు.  నాయకులు వస్తున్నారు, కుర్చీలు ఖాళీ చేయమంటూ గతంలో జయప్రకాష్ నారాయణ్ చేసిన ఓ వ్యాఖ్యను పవన్  ట్వీట్ చేయడంపై నాని స్పందించారు. గత ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి కుర్చీని కూలదోసి ప్రజలే వైసీపీని గెలిపించిన సంగతి ఆయన మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు.

నిన్న పవన్ వ్యాఖ్యలు చూస్తే చాగంటి కోటేశ్వరరావుతో సహా ఏ ప్రవచనకర్తా సరిపోరని, పవన్ ఓ రాజకీయ ప్రవచనకారుడని నాని అభివర్ణించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే సంతోషించే వారిలో తాను మొదటి వ్యక్తినని ఇప్పుడు చెబుతున్న పవన్ అమలాపురం అల్లర్ల తరువాత వెంటనే స్పందించిన తీరు ఏమిటని నిలదీశారు. ఆరోజున మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళకు నిప్పు బెడితే అపహాస్యం చేసినట్లు మాట్లాడిన పవన్ ఇప్పుడు వేరేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

రౌడీయిజాన్ని సహించబోనని చెబుతున్న పవన్ అనంతపురంలో ఎవరి ఇంటికెళ్లి కాఫీ తాగి వచ్చారని, 2014 ఎన్నికల్లో దెందులూరులో ఎవరిని గెలిపించాలని మీరు ప్రచారం చేశారని పేర్ని ప్రశ్నించారు. 2014నుంచి 19వరకూ మీరు తిరిగింది రౌదీలతోనేనని మర్చిపోయారా అన్నారు?

జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికే తాను పార్టీ పెడుతునట్లు మొదట్లోనే చెప్పి ఉండాల్సిందన్నారు. ఆయన్ను భీమవరం, గాజువాక ప్రజలు ఓడిస్తే ‘నన్ను వైసీపీ నేతలు అసెంబ్లీ గేటు తాకనివ్వరంట’ అంటూ పవన్ మా పార్టీపై విమర్శలు చేయడం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు.  చిలక జోస్యాలు చెప్పడం తమకు చేతగాదని, కానీ గత ఎన్నికల ముందు ‘ఎప్పటికీ జగన్ సిఎం కాలేరంటూ’  పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాము ఎప్పుడూ ఎవరినుద్దేశించి ఇలా జోస్యం చెప్పలేదని నాని గుర్తు చేశారు.

ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయని, మూడేళ్ళుగా తాము చేపట్టిన కార్యక్రమాలు… మేనిఫెస్టోలో హామీ ఇచ్చినవి, ఇవ్వనివి కూడా నెరవేర్చామని తెలిపారు. లక్షలాది మంది కార్యకర్తలు, ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారని, అంకితభావంతో పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తలలందరినీ  సిఎం జగన్ చేసిన ప్రసంగం ఉత్తేజితులను చేసిందని నాని అన్నారు. కార్యకర్తలందరూ మధురానుభూతులతో ఇళ్ళకు చేరుకున్నారని సతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీ రాజకీయ విధానాలను, కార్యక్రమాలను తప్పుబట్టలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు.  ప్లీనరీ విజయవంతం కావడానికి రోజుల తరబడి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, భద్రతను చేపట్టిన పోలీసులకు, పోలీసు అధికారులకు నాని కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్