తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేపు ముంబయి పయనమవుతున్నారు. మహరాష్ట్ర సిఎం ఉద్దన్ ధాకరేతో సమావేశం అయ్యేందుకు కెసిఆర్ ప్రత్యేకంగా వెళుతున్నారు. జాతీయ స్థాయిలో తాజా రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రులు ఇద్దరు చర్చించనున్నారు. నదుల అనుసంధానంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
సిఎం కేసీఆర్ తో పాటు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కెసిఆర్ తో పాటు మంత్రులు అధికారుల బృందం బయలుదేరనుంది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో ఆయన నివాసం వర్షాలో సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయన వెంటే వెళ్లే టీంకు ఉద్దవ్ థాక్రే భోజనానికి ఆహ్వానించిన విషయం తెల్సిందే. వర్షాలోనే భోజనం చేయనున్నారు. భోజనం, చర్చల అనంతరం సిఎం కెసిఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లనున్నారు.
మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే – తెలంగాణ సిఎం కెసిఆర్ లు రేపు ప్రాథమికంగా సమావేశం అయిన తర్వాత వచ్చే నెల పదవ తేదిన తమిళనాడు సిఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఎన్సిపి అధినేత శరద్ పవార్ తదితరులతో విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు.