సీడ్ బాల్స్ త‌యారీలో స‌రికొత్త గిన్నీస్ రికార్డ్ నెల‌కొల్పిన‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా యంత్రాంగానికి, పాల‌మూరు మ‌హిళా స‌మాఖ్య‌ల కృషిని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రశంసించారు. సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. హరిత హారం స్పూర్తితో, పచ్చదనం పెంపు కోసం గ్రీన్ ఛాలెంజ్ సంస్థ కృషిని సీఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు.

తెలంగాణకు హరిత హారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని స్వయం సహాయక బృందాలు గత ఏడాది నెల‌కొల్పిన 1.18 కోట్ల సీడ్ బాల్స్ త‌యారీ రికార్డును అధిగమించి ఈసారి కేవ‌లం 10 రోజుల్లో 2.08 కోట్ల సీడ్ బాల్స్‌ను త‌యారు చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాయి. ఈ 2.08 సీడ్ బాల్స్‌ను జిల్లాలోని వివిధ ప్రదేశాలలో వెద‌జ‌ల్లారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి జలాలతో నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదన్నారు. బీడు భూములు, రాళ్లు, గుట్టలకే ఇన్నాళ్లూ పరిమితమై ఉన్న పాలమూరు పచ్చదనంతో తన రూపు రేఖలను మార్చుకుని, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుండడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *