New Administration: పరిపాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ మౌళిక సిద్ధంతమని, ఈ దిశగా మూడేళ్ళలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని, కొత్త జిల్లాల ఏర్పాటు మరో సరికొత్త ముందడుగు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రూపుదిద్దుకుందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును తన క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు.
గతంలో గ్రామ స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణ చేశామని, ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా చేసుకుంటున్నామని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, కొత్త కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.
పరిపాలనా సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించడంతో పాటు, స్వాతంత్ర్య సమరయోధులను, గిరిజన అక్కచెల్లెమ్మలు-అన్నదమ్ముల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని, సేవా భావంలో… ఆకాశమంత ఎదిగినవారిని, మహా వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాలకు వారి పేర్లు పెట్టామని వివరించారు.
రాష్ట్రం ఏర్పడిన డెబ్భై ఏళ్ళలో 1970 లో ప్రకాశం, 1979 లో విజయనగరం జిల్లాలు మాత్రమే ఏర్పాటయ్యాయని గుర్తు చేసుకున్నారు. మన కంటే చిన్న రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో కూడా 25 జిల్లాలుంటే నిన్నటివరకూ మన రాష్ట్రంలో 13 మాత్రమే ఉన్నాయన్నారు. నిన్నటి వరకూ సగటున ఒక్కో జిల్లాలో 38 లక్షల 15 వేలమంది ఉన్నారని, జిలాల్లో ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి మరే రాష్ట్రంలోనూ లేదన్నారు.
ఈ మూడేళ్ళలో పరిపాలనను గ్రామ గ్రామానికి, గడప గడపకూ తీసుకు వెళ్ళగలిగామని, పౌర సేవలు మెరుగ్గా అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పారదర్శకత లాంటివి తమ సుపరిపాలనకు నిదర్శనాలని వివరించారు. గ్రామ, రెవిన్యూ డివిజన్, జిల్లాస్థాయిలో యంత్రాంగాలు ఒకదానికొకటి చేయి పట్టుకొని నడిచినప్పుడే పాలన పదికాలాల పాటు నిలిచిపోతుందని సిఎం అభిప్రాయపడ్డారు. అందుకే జిల్లాల ఏర్పాటును ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామన్నారు.
14 ఏళ్ళపాటు సిఎంగా ఉన్నా రెవిన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోగా, ఇప్పుడు అక్కడే డివిజన్ కావాలని కుప్పం ఎమ్మెల్యే (ప్రతిపక్ష నేత చంద్రబాబు ) చేసిన విజ్ఞప్తి మేరకు కుప్పం డివిజన్ ఏర్పాటు చేశామని సిఎం జగన్ వ్యంగ్యాస్త్రం సంధించారు.
“పరిపాలనా వికేంద్రీకరణ ప్రజలకు ద్వారా మేలు జరుగుతుంది కాబట్టి… అదేసరైన విధానం కాబట్టి.. గ్రామంతో మొదలు… రాజధానుల వరకూ ఇదే మా విధానమని స్పష్టంగా తెలియజేస్తూ… కొత్త జిల్లాల వలన ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పారదర్శకత లభించాలని మనసారా కోరుతున్నా” అని సిఎం తన ప్రసంగంలో వివరించారు.
Also Read : నేటి నుంచి 26 జిల్లాలతో ఏపీ పాలన