మైదుకూరులో అక్బర్ భాషా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో ఫోన్లో మాట్లాడిన సిఎం, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ బాధితులకు అండగా ఉండాలని సూచించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) కూడా ఈ విషయమై స్పందించింది. అక్బర్ ఇంటికి వెళ్లి విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మరోవైపు అక్బర్ కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా, తన భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారని, దానిపై ప్రశ్నిస్తే పోలీసులతో ఎన్‌కౌంటర్ చేయిస్తానని బెదిరించారని, కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాలడుతున్నట్లు ఓ సెల్ఫీ వీడియో తీసి తమ బంధువులకు పంపారు. ఈ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సిఐ కొండారెడ్డి తనను బెదిరించారని, ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని వీడియోలో వివరించాడు.
అక్బర్ బాషా వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. చాగలమర్రి, దువ్వూరు పోలీసుల సహకారంతో వారిని కాపాడామని తెలిపారు. సమగ్ర విచారణ చేస్తున్నామని, అంతవరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీఐ, ఇతర పోలీసుల తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
అక్బర్ భాషా సంఘటనను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. “ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోంది. మైదుకూరులో సిఎం జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ భాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసింది. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయింది. ఇక్కడ కూడా తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సిఐ ఒకరు, అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి,అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారు.పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణం. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు? గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే మార్గం దిక్కంటోంది. అక్బర్ మీరు ధైర్యంగా ఉండండి.తెలుగుదేశం మీకు అండగా ఉంది.ప్రభుత్వం వెంటనే అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అంటూ ట్వీట్ చేశారు.