Friday, March 29, 2024
HomeTrending Newsబొగ్గు నిల్వల విషయంలో అప్రమత్తం: సిఎం సూచన

బొగ్గు నిల్వల విషయంలో అప్రమత్తం: సిఎం సూచన

వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని, కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని, ఆ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధంకావాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  విద్యుత్‌ శాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్,  రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.  బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని,  మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు  డిమాండ్ ఉంటుందని అంచనా  వేశామని,  ఇప్పటికే పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నామని అధికారులు సమావేశంలో వివరించారు.

రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తున్నామని, ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని,  మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు  వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచేందుకు  చర్యలు తీసుకున్నామని, మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా మరో 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తిచేస్తున్నామని తెలిపారు.

పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని,
ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని,  ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని సిఎం దృష్టికి తీసుకు వచ్చారు.

ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణం, మైన్స్‌ అండ్‌ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, పరిశ్రమలుశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు పృధ్వీతేజ్, మల్లారెడ్డి సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్ధనరెడ్డి, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : ఏసిడి పేరుతో అదనపు విద్యుత్ చార్జీలు – న్యూడెమోక్రసీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్