Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కే.తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఆండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా మహాత్మాగాంధీ, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నమస్కరించి, తెలంగాణ అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన విజయాలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చూపిన ఉద్యమస్పూర్తినే నేటికి కొనసాగిస్తూ… ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగానాన్నే వినిపిస్తున్నారని ఎన్నారైలను కేటీఆర్ ప్రశంసించారు. ఈ పర్యటనలో పలువురు విదేశీ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో తాను జరిపిన సమావేశాలు సంతృప్తికరంగా సాగాయని తెలిపారు. త్వరలోనే వాటి ఫలితాలు కనిపిస్తాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే తన ప్రథమ కర్తవ్యం అని కేటీఆర్ చెప్పారు. రాబోయే కాలంలో యునైటెడ్ కింగ్ డమ్ తో తెలంగాణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించి సంపద సృష్టించాలని ఎన్నారైలను కేటీఆర్ కోరారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ తో పాటు మిగతా పట్టణాలు, నగరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధిని వికేంద్రికరించామని తెలిపారు. అందులో భాగంగానే ఖమ్మం, కరీంనగర్ ఐటీ టవర్స్ ను ప్రారంభించామని, త్వరలోనే మహబూబ్ నగర్ లోనూ ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాలు మొదలుపెడతాయన్నారు. ఇప్పటికే వరంగల్ లో ఐటీ తో పాటు ఇతర పారిశ్రామిక సంస్థలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ తో పాటు పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ను పూర్తచేయడం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమన్నారు. తెలంగాణలోని లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉండడం ప్రతీ ఒక్కరు గర్వించే విషయమన్నారు.


స్టార్టప్ గా మొదలైన తెలంగాణ రాష్ట్ర విజయప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతుందన్నారు కేటీఆర్. 2014లో లక్షా 24 వేల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం కేవలం ఏడేండ్ల కాలంలోనే 130 శాతం పెరిగి రెండు లక్షల 78 వేల రూపాయలకు చేరడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.ఇంతేకాదు 2014 లో 5 లక్షల 60 వేలు ఉన్న రాష్ట్ర జీడీపీ, ఇవాళ 11 లక్షల 54 వేలకు చేరిందన్నారు. ఇదేదో ఆషామాషీగా చెపుతున్న విషయం కాదని, భారత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందన్నారు. విస్తీర్ణంగా చూసుకుంటే దేశంలో తెలంగాణ 11 వ పెద్ద రాష్ట్రమన్న కేటీఆర్, జనాభాపరంగా 12 వ స్థానంలో ఉందన్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం భారత ఆర్థికవ్యవస్థలో 4 వ స్థానం తెలంగాణదే అన్నారు.
తెలంగాణ సాధిస్తున్న నిరంతర ఆర్థిక వృద్ధి, ఇక్కడి సుస్థిర పాలన, శాంతియుత వాతావరణం ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. అమేజాన్, గూగుల్, ఫేస్ బుక్, మైక్రాన్, ఆపిల్, క్వాల్ కామ్, ఉబర్, సేల్స్ ఫోర్స్, నోవార్టీస్ లు ఆమెరికా ఆవల తమ అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాద్ ను ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఏడు సంవత్సరాల్లోనే ఇవన్నీ జరిగాయన్నారు. తెలంగాణ సాగిస్తున్న ఈ ప్రగతి ప్రయాణాన్ని తెలంగాణ ఎన్నారైలు మరింత ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం తమతో కలిసి రావాలని కోరారు.

Also Read : లండన్‌ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ఒప్పందం

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com