Saturday, January 18, 2025
Homeసినిమాకామెడీతో సత్య చేసిన మేజిక్ .. 'మత్తు వదలరా 2' 

కామెడీతో సత్య చేసిన మేజిక్ .. ‘మత్తు వదలరా 2’ 

కమెడియన్ సత్య .. తెలుగు సినిమాతో పరిచయమున్న చాలామందికి ఈ పేరు తెలుసు. సత్య ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయింది. హీరోలకి స్నేహితుడిలా ఆయన  చాలా సినిమాలలో కనిపించాడు. పాత్ర ఏదైనా దానిని ఓన్ చేసుకోవడం .. కెమెరాను పట్టించుకోకుండా చెలరేగిపోవడం ఆయనకి అలవాటు. సునీల్ .. వెన్నెల కిశోర్ వంటి కామెడియన్స్ స్టార్స్ గా జోరు చూపుతున్న సమయంలో తనదైన ప్రత్యేకతను చాటుకోవడం ఏ కమెడియన్ కైనా కష్టమే. ఆ కష్టాన్ని దాటినవాడు సత్య.

సునీల్ .. వెన్నెల కిశోర్ ఇద్దరూ కూడా కామెడీపై తమదైన మార్కు వేసినవారే. వాళ్ల పోటీకి తట్టుకుని నిలబడటం ఒక ఎత్తయితే .. ఒకే సినిమాలో వాళ్ల ధాటిని తట్టుకుని నవ్వించడం మరొక ఎత్తు. ఆ పనిని ఆయన సక్సెస్ ఫుల్ గా చేసిన సినిమానే ‘మత్తు వదలరా 2’. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. శ్రీ సింహా – ఫరియా అబ్దుల్లా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రలో సత్య కనిపిస్తాడు.

ఈ సినిమాలో ఏసుదాసు అనే పాత్రను సత్య పోషించాడు. హీరోతో కలిసి కిడ్నాప్ కేసులు పరిష్కరించడం .. హీరోతో కలిసి కొంత డబ్బు నొక్కేయడం వంటి పనులు చేసే ఈ పాత్రకి  సత్య జీవం పోశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆయన డైలాగ్స్ కూడా బాగా పేలాయి. కథాకథనాల సంగతి అటుంచితే, సత్య కామెడీ కోసం ఈ సినిమా చూడొచ్చుననే టాక్ వినిపిస్తోంది. చాలా రోజుల తరువాత సరదాగా కాసేపు నవ్వుకునే సినిమా వచ్చిందనే అభిప్రాయాలు థియేటర్ల దగ్గర గట్టిగానే వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్