Friday, November 22, 2024
Homeజాతీయంకాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు సీజ్

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు సీజ్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వ చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్.డి.ఏ. కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉంది. అయితే వివిధ ప్రభుత్వ శాఖల నిర్వాకంతో ఎన్నికల నాటికి వ్యతిరేక వాతావరణం నెలకొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కరెంట్ బిల్ కట్టేందుకు కూడా డబ్బుల్లేక విలవిలలాడిందని మాకెన్ మీడియాకు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్దేశపూర్వకంగానే చేయించిందని ఆరోపించారు.

తమ పార్టీ ఖాతాలను సీజ్ విషయంపై తాము ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యులేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీంతో గంట తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ రిలీజ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు యథావిధిగా జరుగుతున్నాయని సమాచారం.

రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా జరిగిన చర్య అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ తీరుపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, న్యాయ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని చెప్పారు.

బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో ఆఫీసు కరెంట్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి లేదని మాకెన్ తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘న్యాయ్ యాత్ర’ పైనా దీని ప్రభావం పడుతుందని చెప్పారు.

ఆదాయపన్ను చెల్లించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు ఇన్ కంట్యాక్స్ డిపార్ట్ మెంట్ వివరించింది. రూ. 210 కోట్ల పన్ను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారమే పార్టీ ఖాతాలను సీజ్ చేసినట్లు పేర్కొంది.

ఇలాంటి వ్యవహారాలు ఎన్నికల వేళ జరిగితే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టేనని రాజనీతిజ్ఞులు అంటున్నారు. రాజకీయంగా బలంగా లేని కాంగ్రెస్ పార్టీకి టానిక్ మాదిరిగా బలం చేకురుస్తాయని… బిజెపి చిక్కుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్